సుప్రీం కోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌గా సదాశివం ప్రమాణం


తొలి తమిళ సీజే
న్యూఢిల్లీ, జులై 19 (జనంసాక్షి) :
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జ్టసిస్‌ పి.సదాశివం ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జ్టసిస్‌ సదాశివంతో ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు 40వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జ్టసిస్‌ సదాశివం 2014 ఏప్రిల్‌ 26 వరకూ ఆ పదవిలో కొనసాగుతారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న జస్టిస్‌ ఆల్తమస్కబీర్‌ పదవీవిరమణ చేశారు. ప్రమాణోత్సవ కార్యక్రమంలో ప్రధాని మన్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌గా తమిళనాడుకు చెందిన వ్యక్తికి అవకాశం రావడం ఇదే ప్రథమం. తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లాలో ఒక సాధారణ కుటుంబంలో 1949 ఏప్రిల్‌ 27న సదాశివం జన్మించారు. 1973లో న్యాయశాస్త్రంలో పట్టాపొంది, 1996 జనవరిలో మద్రాస్‌ హైకోర్టులో న్యాయమూర్తిగా చేరారు. 2007లో పంజాబ్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అదే ఏడాది ఆగస్టు 21న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. రిట్‌ పిటిషన్లు, సివిల్‌, క్రిమినల్‌, కంపెనీ లా తదితర అంశాల్లో లోతైన అవగాహన ఉన్న సదాశివం ముంబయి పేలుళ్ల కేసులో సంచలనాత్మక తీర్పులు చెప్పారు.