రాష్ట్రవ్యాప్తంగా కుండపోతగా వర్షం


రాగల 48 గంటల్లో భారీ వర్షాలు : ఐఎండీ
ఉత్తర తెలంగాణలో రికార్డు స్థాయి వర్షం
ఉప్పొంగుతున్న నదులు, వాగులు, వంకలు
పరిస్థితిని సమీక్షించిన మంత్రివర్గం
సహాయక చర్యలకు ఆదేశాలు
జిల్లాకో సీనియర్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి
హైదరాబాద్‌, జూలై 17 (జనంసాక్షి) :
రాష్ట్ర వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ జిల్లాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. రెండు రోజుల నుంచి కురుస్తన్న భారీ వర్షాలతో తెలంగాణ ప్రాంతం తడిసిమద్దయింది. నైరుతి రుతు పవనాలకు అల్పపీడన ద్రోణి తోడుకావడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టులు జలకళసంతరించుకున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. మంగళవారం నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పోటెత్తాయి.రోడ్లు, వంతెనలు తెగి పోవడంతో పలుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం కూడా పలు జిల్లాల్లో భారీవర్షాలు నమో దయ్యాయి. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈదురుగాలుల వల్ల రాకపోకలకు, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్లు విరిగి రోడ్లు, రైలు పట్టాలపై పడడంతో వాహనాలు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్‌ తీగలు తెగిపడడంతో పలు ప్రాంతాలకు కరెంట్‌ నిలిచిపోయింది. తెలంగాణలో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లాలో 12 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదైంది. రెండ్రోజులు కురుస్తున్న వర్షాలకు లో తట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గౌతంనగర్‌, ఇస్లాంపుర, ఖాజాకాలనీ, హబీబ్‌నగర్‌, ఆటోనగర్‌ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వర్షపునీరు చేరింది. కల్యాణి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రెండు గేట్లుఎత్తి 250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ధర్పల్లి మండలం ఎల్లారెడ్డిపల్లిలో కాలువకు గండిపడింది. దీంతో ఇందల్వాయి, ధర్పల్లిమధ్య రాకపోకలు నిలిచాయి. రఘునాథ ట్యాంక్‌ పూర్తిగా నిండడడంతో నగరంలోకి నీళ్లు వచ్చాయి. భారీ వర్షాలకు జిల్లా ఎస్పీ నివాసం వద్ద పెద్ద చెట్టు కూలిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మద్నూర్‌ మండలంలో వాగు పొంగి గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. నిజాంసాగర్‌, కల్యాణి, కౌలస్‌నాలా పూర్తిగా నిండాయి. వర్షాలతో బోధన్‌డివిజన్‌లో 20ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇన్‌చార్జికలెక్టర్‌ హర్షవర్ధన్‌ శుక్రవారం ఉదయం నిజామాబాద్‌లో నీట మునిగిన లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. కాగజ్‌నగర్‌, రెబ్బెన మండలం, సిర్పూర్‌(టి)లో భారీగా వర్షం కురసింది. రెండ్రోజుల నుంచి కురుస్తున్న భారీవర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలతో పాటు నదులు పొంగిపొర్లుతున్నాయి. కాగజ్‌నగర్‌ సిర్పూరు (టి) సమీపంలోని టోంకిని వద్ద ప్రాణాహిత నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అలాగే, సమీపంలో తాటిచెట్టు వాగు కూడా ఉగ్రరూపం దాల్చింది. దీంతో కౌటాల, బెజ్జూరు మండ లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇకపెన్‌గంగా నదికూడా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.పిండల్వాడగ్రామం నీట మునిగింది. దీంతోపాటు బేల మండలంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల్లోపంటపొలాలు నీటిమునిగాయి. వరంగల్‌జిల్లాలోని ఏటూరునాగారం, జనగాం, పరకాల, భూపాలపల్లిలలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు  ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పరకాలలో చలివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరిలో వరదనీరు చేరడంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఏజెన్సీలోని ఆరు గ్రామాలకురాకపోకలు తెగిపోయాయి. నర్సింపేటలో భారీ వర్షం కారణంగా దుగ్గొండ చెరువు పొంగి ప్రవహిస్తోంది. వర్షం కారణంగా సింగరేణి గనుల్లోబొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భారీ వర్షం కురస్తుండడంతో యంత్రాలు, వాహనాలు ఎక్క డికక్కడే నిలిచిపోయాయి. దీంతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. కరీంనగర్‌ జిల్లాలోనూ భారీ వర్షం నమోదైంది. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, గంగాధర మండలాల్లో బుధవారం విస్తారంగా వర్షంకురిసింది. సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. రామగుండం రిజియన్‌లోని నాలుగుఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. నల్లగొండ జిల్లాలోనూ రెండ్రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూసీ జలాశయంలోకి 500 క్యూసెక్కుల వరదనీరు చేరింది. దీంతో జలాశయంలో నీటిమట్టం 626అడుగులకుచేరిం ది. ఖమ్మం జిల్లాలో గోదావరి వరద ఉద్ధృతిపెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 29.4 అడుగులకు చేరింది. భారీ వర్షాలకు ఇల్లెందు ఏరియాలో ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సింగరేణి కాలరీస్‌లో మంగళవారం నుంచి కురుస్తున్న వర్షాల వల్ల 48 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఓబీ గుట్టలనుంచి వస్తున్న వరదకారణంగా కోలుబెంచీలు నీటితోనిండి పోయాయి. ఫలితంగా పెదద్‌ మొత్తంలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఎనిమిది మోటర్ల ద్వారా నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తున్నా ఫలితంలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాయలసీమలోని విద్యుత్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు, బెంగళూర్‌లోని పేపర్‌ బోర్డు, భారతీ సిమెంట్స్‌కు బొగ్గు రవాణా తగ్గించేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది.
అత్యధిక వర్షపాతం : ఐఎండీ
రాష్ట్రంలో ఇప్పటికే అధిక వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ పేర్కొంది. సాధారణ వర్షపాతం కంటే 40 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని తెలిపింది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 207.9మీమీ కాగా శుక్రవారం నాటికి 291.4మీమ వర్షపాతం కురిసిందని తెలియజేసింది. కోస్తాలో 196.1మీమీ వర్షపాతం కురియాల్సి ఉండగా.. 224.9మీమీ వర్షపాతం నమోదైందని వెల్లడించింది. అదేవిధంగా రాయలసీమలో 9శాతం మేర అధికంగా వర్షపాతం కురిసిందని.. సాధారణ వర్షపాతం 119.8 మీమీ కాగా.. 130.4మీమీ నమోదైందని తెలిపింది. తెలంగాణలో 63శాతం అధికంగా వర్షం కురిసిందని ఐఎండి చెప్పింది.  సాధారణ వర్షపాతం 269మిమి కాగా.. 439.4మీమీ వర్షపాతం నమోదైందని వెల్లడించింది.

భారీ వర్షాలకు 8మంది మృతి : రఘువీరా

భారీ వర్షాలకు ఎనిమిది మంది మృతి చెందారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డి తెలిపారు. శుక్రవారంనాడు మాట్లాడుతూ భారీ వర్షాలకు 1,470 ఇళ్లు పాక్షికంగాను.. 177 ఇళ్లు పూర్తిగాను ధ్వంసమయ్యాయని చెప్పారు. సహాయక చర్యల నిమిత్తం నాలుగు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఇప్పటికే ఒక హెలికాప్టర్‌ ద్వారా ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. సహాయక పునరావాస చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఆయా జిల్లా కలెక్టర్లు, అధికారులు, సిబ్బంది పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తగు నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. భద్రాచలంలో వరదల నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని కోరనున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 60వేల హెక్టార్ల మేర పంట దెబ్బతిన్నట్టు సమాచారం అందిందని తెలిపారు. పలు ప్రాంతాల్లో కంట్రోలు రూములు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. అంతకుముందు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై సమీక్షించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు వినియోగించాలని సూచించారు.
జిల్లాలకు సీనియర్‌ ఐఏఎస్‌ల పర్యవేక్షణ
తెలంగాణలో గత పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జరుగుతున్న పరిణామాలను సమీక్షించడంతో పాటు, సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను ఇన్‌చార్జిలుగా ఒక్కో జిల్లాకు ఒకరిని నియమించింది. ఇందులో బాగంగా కరీంనగర్‌ జిల్లాకు మాజీ కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, వరంగల్‌ జిల్లాకు జనార్దన్‌రెడ్డి, ఖమ్మం జిల్లాకు ఎస్‌కె ప్రసాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాకు అక్కడి మాజీ కలెక్టర్‌ అహ్మద్‌నదీం, తూర్పుగోదావరి జిల్లాకు ఎంవీ రవిచంద్ర, పశ్చిమగోదావరి జిల్లాకు సంజయ్‌ జాజును పర్యవేక్షకులుగా నియమించింది. తక్షణమే వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లి అక్కడే ఉండి అన్నిచర్యలను చేపట్టాలని ప్రభుత్వం సూచించింది.