దేశం క్లిస్ట పరిస్థితుల్లో ఉంది


ఆందోళనకరంగా విదేశీ మారకం
మరిన్ని రంగాల్లో ఎఫ్‌డీఐలు
ప్రపంచ దేశాలన్నీ ఇలానే ఉన్నాయి
6.7 శాతం వృద్ధి రేటు సాధ్యం కాదు
కరెంట్‌ ఖాతాల లోటును నియంత్రించాం : ప్రధాని
న్యూఢిల్లీ, జూలై 20 (జనంసాక్షి) :
దేశం ఆర్థికంగా క్లిస్ట పరిస్థితుల్లో ఉందని ప్రధని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో అసోచామ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అస్థిరమైన విదేశీ మారక విపణి ఆందోళన కలిగిస్తోందని ప్రధాని అన్నారు. బంగారం, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. వీటి దిగుమతి దేశీయంగా ఆర్థిక సమస్యలకు కారణం అవుతోందని అన్నారు. ఇటీవల ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు దీర్ఘకాలిక రుణాల వడ్డీరేట్ల పెంపుదలకు సంకేతం కాదన్నారు. కరెంటు ఖాతా లోటు నియంత్రణకు అన్ని విధానపరమైన చర్యలు తీసుకున్నామని, దీంతో కరెంటు ఖాతా లోటును నియంత్రించగలిగామని పేర్కొన్నారు. వచ్చే ఏడాదికి కరెంటు ఖాతా లోటు మరింత తగ్గుతుందన్నారు. దేశ ఆర్థిక మూలాలు దృఢంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే అనేకచర్యలు తీసుకున్నామని, అవి ఇప్పుడిప్పుడే ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. రూపాయి పతనం ఆందోళనకరంగా ఉందని, మార్కెట్ల స్థిరీకరణకు ఆర్‌బిఐ కృషి చేస్తోందని చెప్పారు. దేశంలో మరిన్ని రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తామని, ప్రస్తుత పరిస్థితుల్లో దేశం 6.7 శాతం వృద్ధిరేటు సాధించడం సాధ్యం కాదన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక పరిస్థితి ఇలాగే ఉందని చెప్పారు.