సీమాంధ్ర ఊహాగానాలకు తెర


తెలంగాణపై ఫైనల్‌
అఖిలపక్షాలు లేవు : దిగ్విజయ్‌
28న సీడబ్ల్యూసీ భేటీ
విభజనకే కోర్‌కమిటీ మొగ్గు
నానిస్తే నష్టపోతాం
హైదరాబాద్‌, జులై 19 (జనంసాక్షి) :
తెలంగాణపై తేల్చేదిశగా కాంగ్రెస్‌ అధిష్టానం చర్యలను వేగవంతం చేసింది. రాష్ట్ర విభజనవైపే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. తెలంగాణ అంశంపై ప్రత్యేకంగా ఈనెల 28న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్‌ అధిష్టానం న్యాయనిపుణులతో రాజ్యాంగ పరమైన చిక్కులపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలోనే ఆర్థిక, తాగునీటి రంగ నిపుణులు వంటి వారితో కూడా ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే కూడా కాలపరిమితి లేదని చెప్పినా అతి త్వరలోనే తెలంగాణపై నిర్ణయం ఉంటుందని ప్రకటించారు. అయితే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులందరికీ గురువారం సమాచారం పంపారు. 28న సాయంత్రం సమావేశం నిర్వహిస్తున్నట్టుగా వారికి తెలియజేశారు. దీంతో 28నే తెలంగాణపై నిర్ణయం ఉంటుందనే ప్రచారం ఢిల్లీ స్థాయిలో ఊపందుకుంది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నేరుగా రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ను ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడిన విషయం తెలిసిందే. రాష్ట్ర శాసనసభలో తెలంగాణ తీర్మానం ప్రవేశపెడితే నెలకొనే పరిణామాలు స్పీకర్‌ వ్యక్తిగత అభిప్రాయం, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు వీటన్నింటిపై స్పీకర్‌ నుంచి సోనియా గాంధీ వివరాలు సేకరించినట్టు తెలిసింది. నాదెండ్ల మనోహర్‌ సోనియాతోపాటు రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించే హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో కూడా భేటీ అయ్యారు. రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోకపోతే శాసనసభ స్పీకర్‌ పాత్ర ఏమీ ఉండదు. స్పీకర్‌ను కాంగ్రెస్‌ అధిష్టానం పిలిపించుకోవడంతో రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌ అధిష్టానం స్పష్టమైన సంకేతాలే పంపినట్టు అయిందని పలువురు రాజ్యాంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఇచ్చిన రోడ్‌మ్యాప్‌లపై కాంగ్రెస్‌ పెద్దలు చర్చలు సాగించినట్టు తెలిసింది. వీరిచ్చిన నివేదికలోని అంశాలపై పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. అయితే డెప్యూటీ సీఎం మరో నివేదిక ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో సీమాంధ్ర నాయకులు కూడా మరోసారి ఢిల్లీ వెళ్లేందుకు పయనమవుతున్నారు. సీమాంధ్ర నాయకులు కూడా పలువురు ఇప్పటికే కాంగ్రెస్‌ అధిష్టానం ఇచ్చిన సంకేతాలపై చర్చలు జరిపినట్టు తెలిసింది.  అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రహస్యంగా సమావేశమై రాయలతెలంగాణకే కేంద్రం మొగ్గుచూపితే ఏవిధంగా స్పందించాలనే అంశంపై చర్చలు జరిపినట్టు తెలిసింది.  చివరకు పైకి వ్యతిరేకించినట్టు మాట్లాడినా అంతర్గతంగా వారు రాయల తెలంగాణకు మొగ్గు చూపినట్టు  సమాచారం. వైఎస్సార్‌ సీపీ మాత్రం రాయల తెలంగాణ నిర్ణయమే వెలువడితే దానిని అడ్డుకుని తీరాలన్న యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఆ రెండు జిల్లాలు భవిష్యత్తులో ఆంధ్రరాష్ట్రంలో ఉంటేనే విజయావకాశాలు ఉంటాయని  భావిస్తున్న ఆ పార్టీ కేవలం తమను దెబ్బతీసేందుకే కాంగ్రెస్‌ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా వారు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్‌ నాయకులు రాయల తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించినా తాము మాత్రం ప్రజలలో ఒక ఉద్యమాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. జగన్‌ కూడా ఈ విషయంలో అలసత్వం వద్దని, ఇదే జరిగితే తమకు దెబ్బని స్పష్టంగా ఆ పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. అయితే కేంద్రం కూడా రాష్ట్ర విభజన నిర్ణయానికి వచ్చినా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలా? లేక రాయల తెలంగాణ ఇవ్వాలా? అనే అంశంపై ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి వ్యతిరేకత వస్తే పది జిల్లాలతో కూడిన తెలంగాణ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన సంకేతాలతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొంత ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు తెలుగు మాట్లాడే వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని ప్రశ్నిస్తూ వచ్చిన పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ ఈ మధ్యే మాట మార్చారు. సమైక్యం వైపే తాను మొగ్గు చూపుతున్నట్టు ప్రకటించారు. ఇతని వ్యాఖ్యలు కూడా వ్యూహాత్మకమే అనే చర్చ మొదలైంది. అప్పట్లో రాష్ట్ర విభజన అంత సులభం కాదని భావించిన బొత్స వ్యూహాత్మకంగానే విభజనకు అనుకూలంగా మాట్లాడారని, మారిన పరిస్థితుల నేపథ్యంలో తన ప్రాంత ప్రజల మనో భావాలకు వ్యతిరేకంగా మాట్లాడితే కొంత ఇబ్బందులు తప్పవని ఉద్దేశంతో కేంద్రం కూడా విభజన వైపే మొగ్గు చూపుతుందన్న భావనతోనే బొత్స కూడా మాటా మాట్లాడారనే వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. ఏదిఏమైనా కాంగ్రెస్‌ అధిష్టానం విభజనవైపే మొగ్గుచూపుతున్నందునే రాజ్యాంగ నిపుణులతో, స్పీకర్‌తో చర్చలు జరిపిందనే వాదనలే బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తారన్న ఊహాగానాలను కాంగ్రెస్‌ వర్గాలు కొట్టిపారేశాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలతో సంప్రదింపులు ముగిశాయని, తమ పార్టీ నిర్ణయం తీసుకోవడమే మిగిలి ఉందని చెప్పారు. అందుకోసమే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ముంబయి : తెలంగాణపై సంప్రదింపులు పూర్తయ్యాయని కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి  దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. దిగ్విజయ్‌ మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ముంబై, పూణెలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై యూపీఏ ప్రబుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. తెలంగాణపై సంప్రదింపులు పూర్తయ్యాయని, యూపీఏ ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. లౌకికవాదం, భారతీయ జనతా పార్టీపైన సుదీర్ఘంగా మాట్లాడారు. అదే సమయంలో తెలంగాణ అంశంపై స్పందించారు. తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అయితే, అది పార్లమెంటు సమావేశాలకు ముందా లేక తర్వాతనా అన్న విషయం మాత్రం తెలియదన్నారు. సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నట్లు చెప్పారు. త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పిన షిండే.. ఆ నిర్ణయం కాంగ్రెసు పార్టీదా, యూపిఏ నిర్ణయమా లేక ప్రభుత్వానిదా అని కూడా వెల్లడించలేదు. అయితే ఈ రోజు దిగ్విజయ్‌ మాత్రం యూపిఏ ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ¬ంశాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే గురువారం చెప్పిన విషయం తెలిసిందే.