వరద ప్రాంతాల్లో ఎన్నికల వాయిదాకు సిద్ధం రమాకాంత్‌


హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి) :
వరద ప్రాంతాల్లో ఎన్నికల వాయిదాకు సిద్ధమని ఎన్నికల సంఘం కమిషనర్‌ రమాకాంత్‌ తెలిపారు. శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. వరద ప్రాంతాల్లో ఆయా జిల్లా కలెక్టర్ల నివేదిక మేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించారు. వాయిదా పడిన చోట్ల ఈ నెల 31వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపారు. శనివారం సాయంత్రం 6.30 గంటల తర్వాత వరద పరిస్థితిని మరోసారి సమీక్షించుకుని ప్రాంతాల వారీగా వివరాలను పంపించాలని కలెక్టర్లను కోరామని చెప్పారు. అదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల్లోని పలు మండలాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉందని వార్తలు వస్తున్నాయన్నారు. అలాగే నిజామాబాద్‌ జిల్లాలో రెండు గ్రామాల్లోను, వరంగల్‌ జిల్లాలో పలు గ్రామాల్లోను, ఉభయ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాల్లోను వరద ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోందన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్ల నివేదిక మేరకు ఎన్నికల వాయిదాపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించారు.  రాష్ట్ర వ్యాప్తంగా పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్థితులను సమీక్షించామని చెప్పారు. 6189 సమస్యాత్మక గ్రామాలుగా.. మరో 5810 అతి సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించామన్నారు. భారీగా భద్రతను ఏర్పాటు చేశామన్నారు. శనివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10,790 బెల్టు షాపులను మూసివేయించామని తెలిపారు. 96,217 మందిపై బైండోవర్‌ కేసులు పెట్టామన్నారు. 121 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. రూ.12,56,92,260లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 7300 గ్రామాల్లో సూక్ష్మ పరిశీలకులను ఏర్పాటు చేశామని తెలిపారు. అదే విధంగా 6116 గ్రామాల్లో వీడియో చిత్రీకరణకు ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికల నిర్వహణకుగానూ 1,08,650 మందిని నియమించామని వివరించారు. ట్రైనీ ఉద్యోగుల సేవలను కూడా ఎన్నికల నిమిత్తం వినియోగించుకుంటున్నామని తెలిపారు.  ఇదిలా ఉండగా, గ్రామ పంచాయితీ ఎన్నికలు ఈనెల 23, 27, 31 తేదీలలో జరగనున్న విషయం తెలిసిందే.