ఎందుకింత పాపానికి ఒడిగట్టారో…


పురుగుల మందే పెరుగన్నం
మధ్యాహ్న భోజనంలో మోనోక్రోటోఫాస్‌ అవశేషాలు
ఫోరెన్సిక్‌ నివేదికలో వెల్లడి
చాప్రా, జూలై 20 (జనంసాక్షి) :
దేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేసిన బీహార్‌ కలుషితాహారం ఘటనలో ఇంకా దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థులకు వడ్డించిన మధ్యాహ్న భోజనంలో మోనోక్రోటోఫాస్‌ అవశేషాలు ఉన్నట్లు ఫోరెన్సిక్‌ నివేదిక వెల్లడించింది. బీహార్‌లోని చాప్రా డివిజన్‌లోని గందావన్‌ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజనం వికటించి 23 మంది విద్యార్థులు మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఫోరెన్సిక్‌ నివేదిక శనివారం వెల్లడైంది. మరోవైపు ఈ ఘటనలో 90 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ దుర్ఘటనకు ప్రధానోపాధ్యాయురాలు మీనాదేవి నిర్లక్ష్యమే కారణమని తేల్చారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉండగా, ఆమె ఆస్తులను అధికారులు జప్తు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో 30 మంది పేర్లు పేర్కొనగా, 60 మందిపై గుర్తు తెలియని వ్యక్తులుగా పేర్కొన్నారు.