ముంచెత్తిన వరదలు ఎగిరొచ్చిన హెలికాప్టర్లు


ఉత్తర తెలంగాణలో భారీ వర్షం
రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం అతలాకుతలం
హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి) :
ఎడతెరిపిలేని వర్షాలు ఎడతెగని వరదను తెచ్చిపెట్టాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలను అతలాకుతలం చేశాయి. అదిలాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌, ఉభయ గోదావరి జిల్లాలు భారీ వర్షాలు, వరదల దాటికి అతలాకుతలమయ్యాయి. వేలాది ఎకరాల్లోని పంట నీటి పాలైంది. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి బాలరాజు తదితరులు వరదలు, సహాయక చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. వరద ప్రాంతాల వివరాలు అందజేయాలని ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లను కోరారు. సాయంత్రంలోగా ముంపు బాధిత ప్రాంతాలలో ఎన్నికల నిర్వహణపై తుదినిర్ణయం తీసుకుంటామని రమాకాంత్‌ తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇదిలా ఉండగా, పదకొండు జిల్లాలకు ముంపు పొంచి ఉందని కేంద్ర జలసంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు తెలిసింది. మరో అల్పపీడనం చోటుచేసుకోవడంతో రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురవనున్నాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. పలు జిల్లాల్లో వివరాలు ఇలా ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
– ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది శనివారం ఉదయం నుంచి నిలకడగా ప్రవహిస్తోంది.. నీటిమట్టం 55 అడుగులకు చేరింది. మూడో ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. శనివారం సాయంత్రం వరద ఉధృతి నిదానంగా ఉంది. రాత్రికి నీటిమట్టం తగ్గే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. జిల్లాలో వరద పరిస్థితులపై ఉన్నతాధికారులతో ఇన్‌చార్జి మంత్రి బాలరాజు సమావేశమయ్యారు. తగిన సలహాలు, సూచనలు అందజేశారు.
– కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం బెనికేపల్లి వద్ద తుమ్మలచెరువుకు గండిపడింది. 20 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మహదేవ్‌పూర్‌ మండలంలోని బాధితుల సహాయం కోసం మూడు ఆర్మీ హెలికాప్టర్లు చేరుకున్నాయి. పంకెన, పలిమెల, మోదేడు ప్రజలకు ఆహార పొట్లాలను.. మందులను జారవిడుస్తున్నాయి. ఇదిలా ఉండగా, 39 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. మంథని మండలం అతలాకుతలమైంది. బొక్కలవాగు దెబ్బతింది. అంతేగాక, పదివేల హెక్టార్లలోని వరి, పత్తి పంటలు నీటి పాలయ్యాయి.

– నిజామాబాద్‌ జిల్లా పిట్లం మండలం తిమ్మాపూర్‌ వద్ద నల్లవాగు వంతెన ధ్వంసమైంది. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

– తూర్పుగోదావరి జిల్లాలో 1200 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ముత్యాల రాజు తెలిపారు. మామిడికుదురు, ముమ్మిడివరం, రాజోలు ప్రాంతాల ఏటిగట్ట రక్షణకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. భద్రాచలం దిగువున ఉన్న శబరినది నుంచి వచ్చే వరదనీరు గోదావరిలో కలుస్తోందన్నారు. దాంతో రాజమండ్రి వరద గోదావరి నీటిమట్టం పెరుగుతోందన్నారు. ఇదిలా ఉండగా, ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం శనివారం సాయంత్రం 15.70 అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. రాత్రి ఉధృతి పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉంది. ధవళేశ్వరం ప్రాజెక్టు నుంచి 15 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. పోలవరం మండలంలోని 26 గిరిజన గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయి.
– వరంగల్‌ జిల్లాలోనూ భారీ వర్షాలకు హన్మకొండ, రాంపూర్‌ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఏటూర్‌నాగారం ఏజెన్సీలోని పలు గ్రామాలు ఇంకా నీటిముంపులోని చిక్కుకున్నాయి.