అస్త్ర సన్యాసం ఎన్నిసార్లు పిలిపిచ్చినా ప్రజలు స్పందించడం లేదు


ఇక సమైక్యాంధ్రను కాపాడలేం
కనీసం ఆలంపూర్‌, గద్వాలనైనా కలపండి
టీజీ వెంకటేశ్‌
హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి) :
కరడు కట్టిన సమైక్యాంధ్ర వాదిగా పేరున్న మంత్రి టీజీ వెంకటేశ్‌ అస్త్రసన్యాసం చేశారు. సమైక్యాంధ్ర కోసమంటూ ఎన్నిసార్లు పిలిపిచ్చినా ప్రజలు స్పందించడం లేదన్నారు. తెలంగాణ ఇచ్చేస్తారేమోనన్న భయం కలుగుతుందని మంత్రి టీజీ వెంకటేశ్‌ వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలు చెప్పాయని, ప్రజల ఆకాంక్ష మేరకు ఆ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులు కూడా ఇదే కోరుతున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో సమైక్యవాదాన్ని కోరుకుంటున్న తాము వీక్‌పాయింట్‌లో ఉన్నామని టీజీ ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యంగా అధిష్టానం ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోకపోయినా.. తెలంగాణ ఇస్తుందేమోనన్న భయం తమకు వెంటాడుతోందని చెప్పారు. తెలంగాణ విడిపోతుందంటేనే బాధ కలుగుతుందని, దానికి తోడు రాయలసీమను విడగొట్టడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. తాము ఇప్పటికే కర్నూలు రాజధాని, బళ్లారిని కోల్పోయామని, దానివల్ల తుంగభద్ర నీరు తమకు రాకుండా పోతోందని, కనీసం మంచినీళ్లు కూడా అందకుండా పోయిందని వాపోయారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణలోని గద్వాల, అలంపూరు నియోజవర్గాలను రాయలసీమలో కలపాలని మంత్రి సూచించారు. దానివల్ల జలవివాదాలు రావన్నారు. అంతే కాకుండా ఆ ప్రాంత ప్రజలతో రాయలసీమ ప్రజలకు సంబంధాలు ఉన్నాయని వివరించారు. తెలంగాణ ఇవ్వాలని చెప్పిన సీమాంధ్ర నాయకుల వద్దకు ప్రజలు వెళ్లి నిర్ణయం మార్చుకోవాలని అడగాలని, అయితే ఈ విషయంలో మొదటి నుంచి సీమాంధ్రుల్లో సరైన స్పందన లేదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము శక్తికిమించి పోరాడుతున్నామని, ప్రణబ్‌కమిటీ నుంచి శ్రీకృష్ణ కమిటీ వరకు గట్టిగా వాణి వినిపించామని ఆయన వివరించారు. అయితే సీమాంధ్ర ప్రజల సహకారం లేకుండా పోయిందని వాపోయారు. సరిగా స్పందించకుండా విభజనకు ప్రజలు అవకాశం కల్పించినవారవుతారని ఆయన పేర్కొన్నారు. ఒక వేళ విభజనకు నిర్ణయం జరిగితే అందుకు సీమాంధ్ర ప్రజలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమైక్యవాదం బలోపేతం కావాలంటే సీమాంధ్రకు చెందిన అన్ని పార్టీల నాయకులు ఒకేతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. లేకుంటే పరిస్థితులు చేజారిపోయే ప్రమాదం ఉందని టీజీ పేర్కొన్నారు.