అన్నివర్గాల మద్దతుంటేనే అధికారం


యూపీలో మార్పు చూపెట్టాం
ఉత్తరప్రదేశ్‌ సీఎం అఖిలేశ్‌
హైదరాబాద్‌, జూలై 21 (జనంసాక్షి) :
ఉత్తరప్రదేశ్‌లో తాను ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సమాజంలో అన్నివర్గాలను కలుపుకుపోవడం ద్వారానే అధికారంలోకి రాగలిగామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌ చెప్పారు. ఆదివారం అఖిలభారత యాదవ మహా సభలో జాతీయ మహాసభల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసగించారు. తొలుత సమాజ్‌వాది పార్టీ బలహీనమైన పార్టీగా అనేక విమర్శలు ఎదుర్కొందని చెప్పారు. యాదవుల మద్దతు కూడగట్టానని, మిగిలిన బలహీన, నిమ్న వర్గాలను కూడా రాజకీయ అస్తిత్వం కల్పించాలనే రీతిలో తాము వ్యవహరించడం వల్లే ఎన్నికల్లో తమకు అందరూ మద్దతు ఇచ్చారని తెలిపారు. తాము అధికారంలోకి  రావడానికి అదే కారణమైందన్నారు. అందరిని కలుపుకుపోయి ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాము అధికారంలోకి రాగానే యదవులు కాకుండా, దేశవ్యాప్తంగా వున్న యాదవులు ఎంతో సంతోషించారని, ఆంధ్రరాష్ట్రంలో కూడా అదే జరిగిందన్నారు. యూపీలో తన విజయం దేశంలోని యాదవుల్లోని అందరిలోనూ ఉత్సాహం కలిగించిందని తెలిపారు. సమాజంలోని అణచివేయబడిన అన్ని వర్గాలను కలుపుకుపోవడం వల్ల దేశంలో తమకు గౌరవం పెరిగిందన్నారు. యూపీలో యువతకు ఉద్యోగ, విద్యావకాశాలు, ఉపాధి సౌకర్యాలు మెరుగు పరిచేందుకు తీవ్ర ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ల్యాప్‌టాప్‌లు ఇస్తామన్న హామీ నెలబెట్టుకోవడం ద్వారా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పాటు విద్యను కూడా అందించగలిగామని చెప్పారు. ఈ ల్యాప్‌టాప్‌ల పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలుచేయాలనే ప్రయత్నాల్లో పడ్డాయని చెప్పారు. హైదరాబాద్‌లో రావాలంటే మొదట తాను భయపడ్డానని, ఇక్కడున్న పరిస్థితులు ఆ విధంగా ఆలోచింపజేశాయని, అయితే ఈ వేదిక ద్వారా అన్ని పార్టీల యాదవ నేతలను కలుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. యాదవుల అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దక్షిణ భారతదేశానికి వస్తే ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు. లక్నో బిర్యానీ, హైదరాబాద్‌ బిర్యానీకి ప్రపంచలోనే ఎంతో పేరు ఉందని చెప్పారు. మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ, అన్ని జిల్లాల్లో యాదవ విద్యావసతి గృహాలకు స్థలం కేటాయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంజన్‌కుమార్‌ యాదవ్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, చక్రపాణి, ఇతర రాష్ట్రాల మంత్రులు, యాదవ సంఘాల నేతలు పాల్గొన్నారు.