ఏ లీకులూ నమ్మం


బిల్లు పెట్టే వరకూ పోరాటం
కోదండరామ్‌
మెదక్‌, జూలై 21 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీలోని వివిధ వర్గాలు ఇస్తున్న ఏ లీకులను నమ్మబోమని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. మెదక్‌ టీ ఎన్‌జీవోస్‌ భవన్‌లో నిర్వహించిన ‘సాగదీస్తే… సాగనంపుతాం’ ప్రజా చైతన్య యాత్రలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఏర్పాటు కోసం పార్లమెంట్‌ బిల్లు పెడితే తప్ప నమ్మమని అన్నారు. తెలంగాణపై అనేక లీకులిస్తూ ప్రజలను గందరగోళ పరుస్తున్నది కాంగ్రెస్‌ పార్టీ కాదా అని ప్రశ్నించారు. తెలంగాణపై ఇంకా కాలయాపన చేస్తే కాంగ్రెస్‌ పార్టీని ఈ ప్రాంతం నుంచి తరిమికొడతామని హెచ్చరించారు. తెలంగాణ సాధన కోసం ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే నాయకులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భాగమని, అది ఎప్పటికీ సీమాంధ్రుల సొంతం కాబోదని అన్నారు. శాంతియుత ఉద్యమాలతోనే తాము తెలంగాణ ఏర్పాటును కోరుకుంటున్నామని, సీమాంధ్ర సర్కారు ఉద్యమంపై దమనకాండను సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 25న హైదరాబాద్‌లో నిర్వహించే ధర్నాతో కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపిద్దామని పిలుపునిచ్చారు.