పార్టీ వైఖరికి భిన్నంగా మాట్లాడితే చర్యలే


కాంగ్రెస్‌ నేతలకు రాహుల్‌ గాంధీ హెచ్చరిక
న్యూఢిల్లీ  23జులై (జనంసాక్షి) :
పార్టీ వైఖరికి భిన్నంగా వ్యాఖ్యాలు చేసే నేతలపై చర్యలు తప్పవని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోమవారం హెచ్చరించారు. పార్టీ అధికార ప్రతినిధులు, ప్యానలిస్టుల సమావేశంన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ హెచ్చరిక జారీ చేశారు. ‘అధికార ప్రతినిథులు ,ప్యానలిస్టులకు సొంత అభిప్రాయాలు ఉండవచ్చు కానీ  వారు పార్టీ వైఖరికి లోబడి ఉండాలి. అందుకు భిన్నంగా మాట్లాడేవారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం.’ అని రాహుల్‌ గాంధీ హెచ్చరించారు. 2002లో గుజరాత్‌ అల్లర్లు కారణంగానే ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థ పుట్టుకొచ్చిందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి షకీల్‌ అహ్మద్‌, ఎంపీ రషీద్‌ మసూద్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఈ హెచ్చరిక జారీ చేయడం గమనార్హం. ‘పార్టీ వైఖరి ప్రస్తుతానికి అది కాదు’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిథి రేణుకా చౌదరి విలేకర్లతో అన్నారు. మరో ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌, కేంద్ర మంత్రులు బేణి ప్రసాద్‌ వర్మ, జైరాం రమేష్‌ వివిధసందర్భాల్లో చేసిన వివాదస్పద వ్యాఖ్యలను కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. నేతలు వాడే భాష విషయంలో ఎంతో సభ్యతగా ఉండాలని, దుర్భాషను పయోగిస్తే సోషల్‌ మీడియా ప్రత్యక్షమవుతున్న సంగతి గుర్తించాలని కూడ రాహుల్‌ హెచ్చరించారు. ‘మనం అలా మాట్లాడ కూడదు . మనది మహాత్మా గాంధీ పార్టీ’  అని చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తప్పుడు సమాచారన్ని వ్యాప్తి చేస్తోందని గుజరాత్‌ నేతల  ప్రసావించగా ‘అబద్ధాలు ప్రచారం చేసే వారు ఉండొచ్చు. మనదృష్టి మాత్రం సత్యంపైనే ఉండాలి’ అన్నారు.