వైద్యానికి ‘ఆరోగ్యం’


భారీగా ఖాళీల భర్తీలు
జూడాలు గ్రామాల్లో సేవలందించాల్సిందే
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్‌్‌, జూలై 22 (జనంసాక్షి) :
వైద్య ఆరోగ్య శాఖకు జవసత్వాలు ప్రసాదించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వివరాలను మంత్రి కొండ్రు మురళి మీడియాకు వివరించారు. 1200 నర్సుల పోస్టులను వచ్చే మూడేళ్లలో భర్తీ చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. 9,177 పారామెడికల్‌ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు చెప్పారు. దీంతో పాటు 1,900 డాక్టర్ల పోస్టులను నియమించేందుకు కూడా నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. ఉద్యోగుల హెల్త్‌కార్డుల పంపిణీపై కసరత్తు పూర్తయిందని, ఆగస్టు మొదటి వారం నుంచి కార్డుల పంపిణీ చేస్తామన్నారు. హెల్త్‌కార్డుల పంపిణీలో అధికారులు అలసత్వం వీడాలని కోరారు. రాష్ట్రానికి 500 సీట్లు మెడికల్‌ సీట్లు అదనంగా వచ్చాయని, పది మెడికల్‌ కళాశాలకు 50సీట్లు అదనంగా కేటాయిస్తున్నట్లు తెలిపారు. సీట్లు కేటాయించే కళాశాలలకు మౌలిక వసతుల కోసం నిధులు మంజూరు చేయాలని సీఎం ఆదేశించినట్లు కొండ్రు తెలిపారు. పెరిగిన మెడికల్‌ సీట్లకు అనుగుణంగా నిధులు మంజూరు చేయాలని సీఎం చెప్పినట్లు ఆయన తెలిపారు. వైద్యఆరోగ్యశాఖకు మూడింతల బడ్జెట్‌ పెంచాలని కూడా నిర్ణయించారు. బీబీనగర్‌లో నిర్మిస్తునన నిమ్స్‌ ఆస్పత్రిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. 108 సిబ్బంది సమ్మెను నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకుగాను 108 సిబ్బందితోే చర్చలు జరుపుతామని మంత్రి అన్నారు.