తెలంగాణ అంశానికి మావోయిస్టులకు ముడిపెట్టడం ఓ డ్రామా


ఏకగ్రీవాలు బోగస్‌
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ
హైదరాబాద్‌, జూలై 22  (జనంసాక్షి) :
తెలంగాణ సమస్యను నక్సల్స్‌తో ముడిపెట్టడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఇది సీమాంధ్రులు ఆడుతున్న డ్రామాగా ఆయన అభివర్ణించారు.  సోమవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమాల ద్వారా స్థానిక సమస్యలు కొంత మేర పరిష్కారం అవుతున్నాయని ఆయన అన్నారు. స్థానిక సంస్థలను జీహెచ్‌ఎంసీ అధికారులకు తెలిపేందుకే ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు చెప్పారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని ఆయన అన్నారు. అడ్డూ అదుపులేకుండా విధిస్తున్న విద్యుత్‌ కోతలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. డ్రైనేజీ నీటితో మంచి నీరు కూడా కలుషితమవుతోందని నారాయణ అన్నారు. స్థానిక సమస్యలను ఎక్కడికక్కడా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా తెలంగాణ సమస్యతో అధికార కాంగ్రెస్‌ పార్టీ నాటకాలాడుతోందని ఆయన మండిపడ్డారు. నక్సల్స్‌ సమస్యను సాకుగా చూపి తెలంగాణ సమస్యను పరిష్కరించకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని  ఇవ్వకపోతేనే నక్సల్స్‌ సమస్య తీవ్రమవుతోందని ఆయన అన్నారు. తెలంగాణకు నక్సల్స్‌ సమస్య ముడిపెట్టడం అవివేకమని ఆయన అన్నారు. తెలంగాణను సీమాంధ్ర నేతలు ఇలాంటి సమస్యలు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ కోరుకునే పార్టీల మధ్య సమైక్యత రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 28న వామపక్ష పార్టీల నేతృత్వంలో భారీ సదస్సు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెట్టి కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నదని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్‌ పార్టీ అడ్రస్‌ గల్లంతవుతుందని నారాయణ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పలు పార్టీలు సాధించినట్లుగా చెప్తున్న ఏకగ్రీవాలన్నీ బోగస్‌గా ఆయన అభివర్ణించారు.