సీమాంధ్ర మంత్రుల దింపుడుకల్లం ఆశ


తెలంగాణను అడ్డుకునేందుకు సమావేశం
హైదరాబాద్‌, జూలై 24 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం దాదాపు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్న తరుణంలోనూ సీమాంధ్ర ప్రాంత మంత్రులు దింపుడు కల్లం ఆశ వీడలేదు. బుధవారం నగరంలోని మంత్రుల క్వార్టర్స్‌లో సుమారు 20 మంది మంత్రులు భేటీ అయి తెలంగాణను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కుట్రలకు వ్యూహాలు రచించారు. అనంరం ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో సీమాంధ్ర మంత్రులు భేటి అయ్యారు. మంత్రుల నివాస ప్రాంగణంలో జరిగిన సీమాంధ్ర మంత్రుల సమావేశంలో చర్చించిన అంశాలను వారు ముఖ్యమంత్రికి నివేధించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని అధిష్టానానికి కోరేందుకు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించినట్లు మంత్రులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనకాడబోమని మంత్రులు ముఖ్యమంత్రికి చెప్పినట్లు సమాచారం.