పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండండి.. లేకపోతే పొండి

పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ
హైదరాబాద్‌, జూలై 25 (జనంసాక్షి) :
పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండండి లేదంటే వెళ్లిపోండి అంటూ సమైక్యాంధ్రవాదులను పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. రాష్ట్రాన్ని ఏవిధంగా ఉంచాలని హైకమాండ్‌ నిర్ణయించిన విధంగా కాంగ్రెస్‌ పార్టీ నేతలంతా కట్టుబడి ఉంటారని పిసిసి అధ్య క్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటించారు. హైదరాబాద్‌ నుంచి న్యూఢిల్లీ వెళ్లేముందు ఆయన మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ వద్ద మీడియాతో ముచ్చటించారు. సీమాంధ్రకు చెందిన మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తనకు తెలియదన్నారు. తనకు మాత్రం ఒక్క రాజీనామా కూడా అందలేదన్నారు. హైకమాండ్‌ తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించినా, సమైక్యంగా ఉంచాలని చూసినా కూడా ప్రతికాంగ్రెస్‌ వాది మద్దతిస్తారన్నారు. ఏఒక్కరు కూడా పార్టీని కాని పదవులను కాని ఒదులుకుంటారని తాను భావించడం లేదన్నారు. తెలంగాణాపై నిర్ణయం త్వరలోనే తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీయే సమస్యను ఉత్పన్నం చేస్తుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలు శుద్ద అబద్దమన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న చిత్తశుద్దిని ఏఒక్కరు శంకించాల్సిన అవసరం లేదన్నారు. తమ సీమాంధ్ర నేతలు హైకమాండ్‌ దృష్టికి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారే తప్ప రాజీనామాలు చేయరన్నారు. ఒకవేల రాజీనామాచేస్తే అవి వారి వ్యక్తిగత నిర్ణయమే అవుతుందన్నారు. కాంగ్రెస్‌పార్టీ రాజకీయ కోణంలో ఆలోచించి ఉంటే నిర్ణయం ఎప్పుడో వచ్చేదని పిసిసి చీఫ్‌ పేర్కొన్నారు. రాజకీయ లబ్దికోసమే వైఎస్సార్‌సిపి రాజీనామాలని కొట్టిపారేశారు. తెలంగాణా సమస్య సున్నితమైనది కాబట్టే ఆలస్యం అవుతుందన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయం నచ్చిన వారు పార్టీలో ఉంటారు, నచ్చనివారు బయటకు వెళ్లిపోతారన్నారు. ఎంతమంది వెల్లిపోయినా కూడా కాంగ్రెస్‌ పార్టీకి నష్టం లేదన్నారు. కాంగ్రెస్‌ వైఖరి చెప్పకముందే తమను బూచీగా చూపిస్తూ రాజీనామాలు చేస్తున్నామని ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.