అన్నీ అయిపోయాయి


ఇక పార్టీ నిర్ణయం వెలువడుతుంది దిగ్విజయ్‌సింగ్‌
న్యూఢిల్లీ, జూలై 26 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విభజించాలన్న అంశంపై సంప్రతింపులు, చర్చల ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ ప్రకటించారు. సుమారు గంటన్నరకుపైగా కోర్‌ కమిటీ సమావేశం ప్రధాని ఇంట్లో సోనియాగాంధీ అధ్యక్షతన జరిగింది. సమావేశం అనంతరం బయటకు వచ్చిన దిగ్విజయ్‌సింగ్‌ మీడియాతో మాట్లాడారు. రెండు వ్యాఖ్యలతోనే ముగించి వెల్లిపోయారు. కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం,అయితే తుది నిర్ణయం జరిగిపోయిందని, ఇకపార్టీ, యూపీఏ ప్రభుత్వం నిర్ణయం వెలువడాల్సి ఉందన్నారు. తెలంగాణను పది జిల్లాలతో ఏర్పాటు చేస్తారా, లేక సీడబ్ల్యూసీ సమావేశం తేదీలపై కూడా ఏమాత్రం ప్రకటన చేయలేదు. అయితే మీడియా గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తే దిగ్విజయ్‌ సింగ్‌ మాత్రం తన పాత్ర పూర్తయిందని, కాంగ్రెస్‌ పార్టీ, యుపిఏ తమ నిర్ణయాలు వెల్లడించేవరకు వేచి ఉండాలని మాత్రమే చెప్పగలనన్నారు. అంతకుముందు ఢిల్లీలో ఆయన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. హైకమాండ్‌ తీసుకునే నిర్ణయానికి ఇరు ప్రాంతాల నేతలు, కార్యకర్తలు సహకరించాల్సిందేనని తేల్చిచెప్పామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం అనంతరం పార్లమెంట్‌ వ్యవహారాల్లోకి వెళ్తామన్నారు.  సీడబ్ల్యూసీ సమావేశంలో సైతం త్వరలోనే నిర్వహిస్తామని, ఆ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుని వెల్లడిస్తామని తెలిపారు. అయితే రాష్ట్రం విడగొట్టడం ఖాయమనే రీతిలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఉందన్నట్లు దిగ్విజయ్‌సింగ్‌ ముగ్గురు నేతలకు తేల్చిచెప్పినట్లు సమాచారం. పరిస్థితులను చక్కదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలకు ముగ్గురు నేతలు సమష్టిగా కృషిచేయాలని డిగ్గీ రాజా ముఖంపైనే హెచ్చరికల రీతిలో సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.