ప్రజలంటే గంజితాగి బతికేవాళ్లేనా?
ప్రజలంటే గంజితాగి బతికేవాళ్లేనని అర్థం ధ్వనించేలా ముగ్గురు కీలక నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రత్నగర్భగా, బంగారు భూమిగా చెప్పుకునే భారత్‌లో ఆకలి కేకలతో ఏటా వేలాది మంది మృత్యువాత పడుతున్నా వారి కడుపు నింపలేని దుస్థితిలో ఉన్న పాలకవర్గం ప్రతినిధులు పేదరికం అర్థాన్ని మార్చేసేలా మాట్లాడుతున్నారు. అద్దాల మేడల్లో ఉంటూ, ఏసీ కార్లలో తిరిగే నేతలు రోడ్డు పక్కన పట్టెడు మెతుకు కోసం ఆరాట పడే సగటు భారతీయుడి ఆకలిని మాత్రం ఇష్టానికి లెక్క కడుతూ వారు ఈ లోకంలో పుట్టడమే తప్పన్నట్లుగా చూస్తున్నారు. ఈ రత్నగర్భమీద పుట్టిన పాపానికేమో దేశంలో 33 శాతానికిపైగా ప్రజలు కనీసం ఒక్కపూట తిండికి కూడా నోచుకోవడం లేదు. అంతటి దుర్భర పరిస్థితులను దేశ ప్రజలు ఎదుర్కొంటుండగా పాలకులు మాత్రం పేదరికాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నారు. ముంబయిలో 12 రూపాయలకే ఫుల్ మీల్స్ లభిస్తుందని నటుడు, ఎంపీ రాజ్‌బబ్బర్ వ్యాఖ్యానించగా, కాంగ్రెస్ రషీద్ మసూద్ రూ.ఐదుకే ఢిల్లీలో ఫుల్ మీల్స్ లభిస్తుందని పేర్కొన్నాడు. వీరిని తలదన్ని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా ఒక్క రూపాయికి కూడా ఫుల్ మీల్స్ లభిస్తుందని చెప్పారు. రెండు రోజులుగా భోజన కనీస ధరపై ముగ్గురు నేతలు దేశ ప్రజలను అవమాన పరిచేలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో పేదరికంపై 2010లో ప్రపంచ్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాలు దేశ ప్రజలు దుస్థితికి అద్దం పడుతున్నాయి. భారత దేశం పేదరికంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని తేల్చింది. అంతర్జాతీయ దారిద్య్ర రేఖ రోజుకు 1.25 డాలర్లు ఖర్చు చేయలేని దుస్థితిలో దేశంలో 32.7 శాతం ప్రజలున్నట్లుగా తేల్చింది. మిగతా 68.3 శాతం మంది మాత్రం రోజుకు రెండు డాలర్ల వరకు ఖర్చు చేయగలుగుతున్నారని తేల్చింది. అయితే మన ప్రణాళిక సంఘం మాత్రం దేశంలో పేదరికం వేగంగా తగ్గుతోందని చెప్తుంది. 2004-05 ఆర్థిక సంవత్సరంలో దేశంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజలు 32.7 శాతం ఉండగా, 2011-12 ఆర్థిక సంవత్సరానికి 21.9 శాతానికి పడిపోయారని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి మండలి 2010లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారత్‌లో 29.8 శాతం మంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. అదే సంవత్సరం ఆక్స్‌ఫర్డ్ పావర్టీ అండ్ హ్యుమన్ డెవలప్‌మెంట్ ఇంటేటివ్ (ఓపీహెచ్‌ఐ) పేర్కొన్న గణాంకాల ప్రకారం భారత దేశంలోని ఎనిమిది రాష్ట్రాల ప్రజలు 28 ఆఫ్రికాదేశాల్లోని ప్రజలకంటే వెనుకబడి ఉన్నారు. దేశంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిని 2015లోగా 22 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బనం పేదలను మరింత నిరుపేదలుగా మారుస్తుందే తప్ప పేదరికంలో మగ్గుతున్న వారికి చేయూతనిచ్చే పరిస్థితులేమి కనిపించడం లేదు. దేశంలోని ఐదేళ్లలోపు చిన్నారుల్లో 42 శాతం మంది ఉండాల్సిన బరువు కంటే తక్కువగా ఉంటున్నారు. అంటే కనీసం పిల్లలకు ఆహారం అందించలేని దుస్థితిలో ప్రజలు ఉన్నారు. తల్లిబిడ్డల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పలు పథకాలు కాగితాలపైనే ఫలితాలిస్తున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో పూర్తిగా ఉపయోగపడటం లేదు. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, వియత్నాం, కెన్యా, నైజీరియా, ఉగండా, జింబాబ్వే, మలాయి కంటే కూడా భారత్‌లో పేదరికం అత్యధికంగా ఉందని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జీహెచ్‌ఐ) తేల్చింది. 78 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జీహెచ్‌ఐ అధ్యయనం చేసింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.356.35, పట్టణ ప్రాంతాల్లో రూ. 538.60ల కన్నా తక్కువ ఖర్చు చేసే వారు 27.5 శాతం ఉన్నట్లుగా తేలింది. దేశంలోని 75 శాతం మంది రోజుకు 0.40 డాలర్ల కన్నా తక్కువగా (ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకంతో పోల్చితే రూ.25 కన్నా తక్కువ) సంపాదిస్తున్నట్లు తేలింది. దేశంలో పేదరికం పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే నేతలు మాత్రం నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ప్రజలను జీవన పరిస్థితులు అపహాస్యం చేస్తున్నారు. ప్రజలు కనీసం రెండు పూటలా తిండి తినలేని పరిస్థితి దేశంలో తీవ్రంగా ఉంది. కనీసం తిండే దొరకని పరిస్థితుల్లో పౌష్టికాహారం మాటకు చోటే లేదు. ధరలు విపరీతంగా పెరిగిపోయి వంద రూపాయలు ఖర్చు చేసినా రెండు పూటలా పౌష్టికాహారం దొరకని ప్రస్తుత పరిస్థితుల్లో రోజుకు రూ.25లోపు సంపాదించే సగటు భారతీయుడు ఎలా బతకగలడు. బలవర్ధకమైన రేపటి సమాజ నిర్మాణం ఎలా సాధ్యమవుతుంది. నేతలు రూపాయికి, ఐదు రూపాయలకు, 12 రూపాయలకు ఫుల్ మీల్స్ వస్తుందని పేదల జీవన ప్రమాణాల్ని అవహేళన చేస్తున్నారు. ధరలు అదుపుచేయలేని అశక్తతతో చేతులెత్తేసిన పాలకులు పేదలకు ఫుల్‌భోజనంపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. 2015 ఎంతో దూరంలో లేదు. కానీ ఆ లోపు అనుకున్న స్థాయిలో పేదరికాన్ని తగ్గించడం సాధ్యం కాదు. పేదరికాన్ని నిర్మూలించలేని దుస్థితిలో ఉన్న కేంద్ర సర్కారు ధరలను ఇబ్బడి ముబ్బడిగా పెంచేసి పేదల్నే నిర్మూలించే విపరీత పరిస్థితులను సృష్టిస్తోంది.