పది జిల్లాల తెలంగాణే కావాలి


రాయల తెలంగాణ మేం అడగలేదు : కోదండరామ్‌
హైదరాబాద్‌, జూలై 27 (జనంసాక్షి) :
పది జిల్లాల తెలంగాణే కావాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర నేతలు తమ వైఖరిని మార్చుకోవాలని, రాష్ట్ర విభజనకు సహకరించాలని ఆయన కోరారు. శనివా రం టీఎన్జీవో భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరే సమయంలో తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఇచ్చే వరకు తాము ఉద్యమాన్ని ఆపబోమ ని ఆయన హెచ్చరించారు. ఆగస్టు 1న చేపట్టే ధర్నా యథాతదంగా నిర్వహిస్తాన్నారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్ర నేతలు సహకరించాలని కోదండరామ్‌ నేరుగా కోరారు. అన్ని పార్టీలు విభజనకు అంగీకరించాయని, ఇలాంటి పరిస్థితుల్లో అడ్డుకోవద్దన్నారు. విభజన అనివార్యమన్నారు. ప్రజలు నాలుగు దశాబ్దాలుగా చేస్తున్న ఉద్యమానికి ఫలితం రాబోతుందనకున్న తరుణంలో సీమాంధ్ర పెత్తందారులు తోడేళ్ల మాదిరిగా అడ్డుపడటం కొనసాగు తుందని, అలాంటి శక్తుల ఆట కట్టిస్తామని హెచ్చరించారు. పది జిల్లాల్లోని నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరించే ఏ రాజకీయ పార్టీకైనా ఈ ప్రాంతంలో మనుగడ ఉండబోదని స్పష్టం చేశారు. అలాంటి పార్టీలను తరిమికొట్టడానికి తెలంగాణ ప్రజలు ఇప్పటికే సిద్ధమయ్యారన్నారు. తాము హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ తప్ప మరొకటి అంగీకరించమని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ అన్నారు. తాము ఎవరినీ రెచ్చగొట్టమని ఏపీఎన్జీవోను ఉద్దేశించి దేవీప్రసాద్‌ అన్నారు.