కాంగ్రెస్‌ నేతల్లోనే సమైక్యత లేదు


రాష్ట్రాన్నెలా సమైక్యంగా ఉంచుతారు?
ఆగస్టు 15 తెలంగాణకు డెడ్‌లైన్‌ : నారాయణ
హైదరాబాద్‌, జూలై 18 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ నేతల్లోనే సమైక్యత లేదు అలాంటిది రాష్ట్రాన్నెలా సమైక్యంగా ఉంచుతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ ప్రశ్నించారు. నగరంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ఐదు కమ్యూనిస్టు పార్టీల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. చర్చల పేరుతో కాంగ్రెస్‌ అధిష్టానం ఆడుతున్న నాటకానికి ముగింపు పలకాలని డిమాండ్‌ చేశారు. ప్రజల భావోద్వేగాలతో కూడుకున్న అంశాన్ని సాగదీయడం, చర్చల పేరుతో కాలయాపన చేయడం తగదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అనుసరిస్తున్న దాటవేత ధోరణితోనే తెలంగాణ ప్రాంతంలో వెయ్యి మందికిపైగా యువత, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా దాదాపు అన్ని పార్టీలు ఉన్నా కాంగ్రెస్‌ ఓట్లు, సీట్లే ధ్యేయంగా జాప్యం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ఇలాగే జాప్యం చేస్తే తెలంగాణ ప్రజల చేతుల్లో తగిన గుణపాఠం చవిచూడక తప్పదని హెచ్చరించారు.