మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం


5,946 పంచాయతీలకు రేపు పోలింగ్‌ : నవీన్‌మిట్టల్‌
హైదరాబాద్‌, జూలై 29
(జనంసాక్షి) :
మూడో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ తెలిపారు. తుది విడత ఎన్నికలకు ప్రచారం సమాప్తమైం దని పేర్కొన్నారు. మీడియాతో సోమవారం ఆయన మాట్లా డుతూ రెండో విడతలో 87.32 శాతం పోలింగ్‌ నమోదైందని చెప్పారు. ఖమ్మంలో అత్యధికంగా 92.08శాతం నమోదు కాగా.. అత్యల్పంగా కరీంనగర్‌ జిల్లాలో 77.86శాతం నమోదైందని తెలిపారు. బుధవారం ఉదయం 7 గంటలకు 5,946 గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ ప్రారంభం కానున్నట్టు వెల్లడించారు. అదే రోజు మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగుతుందన్నారు. నిర్ణీత సమయం ముగిసినప్పటికీ క్యూ లైనులో ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. దేరోజు మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుం దన్నారు. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడవుతాయన్నారు. కోరం ఉంటే అదే రోజు ఉప సర్పంచ్‌ ఎన్నిక కూడా ఉంటుందన్నారు. తగినంత కోరం లేకపోతే మరుసటి రోజు జరుగుతుందన్నారు. ఇటీవల రెండు విడతల్లో జరిగిన ఎన్నికల సమయంలో ఏడుగురు సర్పంచు అభ్యర్థులు మరణించిన విషయం తెలిసిందే. ఆ ఏడు పంచాయతీల్లో ఆగస్టు 13వ తేదీన ఎన్నిక జరగనున్నట్టు తెలిపారు. ఎన్నికలు ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.20.5 కోట్ల రూపాయలను జప్తు చేశామని వెల్లడించారు.