మీ రక్షణ పూచీ మాది


విభజన తర్వాత మా సోదరులే
సద్భావన యాత్రలో దేవీప్రసాద్‌
హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి) :
హైదరాబాద్‌లో స్థిరపడ్డ సీమాంధ్ర ప్రాంత ప్రజల రక్షణ బాధ్యతను తాము తీసుకుంటామని టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రాంత ప్రజలూ తమ సోదరులేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని రెండుగా విభజించడం వల్ల కలిగేది వికాసమే తప్ప విధ్వంసం కానే కాదని తెలంగాణ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. ఇందుకోసమే సీమాంధ్రులకు నమ్మకం కలిగించాలనే ఉద్దేశ్యంతోనే తాము సద్భావన ర్యాలీని చేపట్టినట్లు ఉద్యోగ సంఘాల నేతలు దేవి ప్రసాద్‌, విఠల్‌ పేర్కొన్నారు. అంతకు ముందు ఉద్యోగ సంఘాల నేతలు, కార్యకర్తలు గన్‌పార్క్‌ వద్ద గుమికూడి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ఉద్యోగులంతా ర్యాలీగా జీహెచ్‌ఎంసీ కార్యలయానికి వెళ్లారు. అక్కడ సమావేశమై కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు దగ్గరి నుంచి గమనిస్తూనే సీమాంధ్రుల కుట్రలపై కూడా కన్నేసి ఉంచాలని నిర్ణయానికి వచ్చారు. ఈ సందర్భంగా దేవీప్రసాద్‌ మాట్లాడుతూ రాష్టాన్న్రి రెండుగా విడగొట్టడం వల్ల సీమాంధ్ర ఉద్యోగులకు ఎలాంటి ఇక్కట్లు రావన్నారు. వారికి రావాల్సిన అన్ని హక్కులను తాము దగ్గరుండి కల్పిస్తామన్నారు. గతంలో పేర్కొన్న కమిటీల ఎజెండాలు, జీవోలకు అనుగుణంగానే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తారని భావిస్తున్నామన్నారు. విడిపోతున్న సమయంలో సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళనలు వ్యక్తం చేయడం తగదన్నారు. ఇప్పటికే తాము ఎంత అన్యాయానికి గురయ్యామో సీమాంధ్రులకు తెలియదా అని ప్రశ్నించారు. ఏఒక్కరిని తాము వెల్లిపోమని చెప్పమన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉద్యోగులు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడే ఉండొచ్చన్నారు. 610 జిఓ అమలు కావాలని కోరుకుంటామని విఠల్‌ పేర్కొన్నారు.