పరిస్థితులు గమనిస్తున్నాం


ప్రకటనే కాదు బిల్లు పెట్టాలి : కోదండరామ్‌
రాయల తెలంగాణకు ఒప్పుకునేది లేదు : కేసీఆర్‌
హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి) :
తెలంగాణపై ఢిల్లీలో జరగుతున్న పరిస్థితులను గమనిస్తున్నాం, కాంగ్రెస్‌ పార్టీ, యూపీఏ ప్రభుత్వం కేవలం ప్రకటనతోనే సరిపెట్టడం కాదు పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజన అంశంపై చర్చించేందుకు సోమవారం తెలంగాణవాదులు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన భేటీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శాంతియుతంగా రాష్ట్ర విభజన జరిగేందుకు సీమాంధ్ర నేతలందరూ సహకరించాలని కోరారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల్లో ఉన్న సీమాంధ్రలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, వారు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిన్న రాష్ట్రాలతో ముప్పు వాటిల్లుతుందన్న ములామంసింగ్‌ యాదవ్‌ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఓట్ల కోసం రాష్ట్ర విభజన చేస్తున్నామని ప్రచారం చేసుకోవడం సరికాదని బీజేపీ నాయకుడు సీహెచ్‌. విద్యాసాగర్‌రావు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయని, వాటిని అధిగమించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌ జాప్యం చేయడం తగదన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామనడం సమంజసం కాదన్నారు.