సీమాంధ్ర పార్టీని విసర్జించిన తెలంగాణ వైకాపా

హైదరాబాద్‌, జూలై 30 (జనంసాక్షి) :

సీమాంధ్ర పార్టీ వైకాపాను తెలంగాణ నాయకులు విసర్జించారు. మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, ఇచ్చేది శక్తిగాని, ఆపే శక్తిగాని తామకు లేదని ఇంతకాలం చెపుతూ వచ్చిన వైఎస్సార్‌ సిపి నిన్నటికి నిన్న కేంద్రం రాష్ట్రం ఏర్పాటు చేస్తుంటే సీమాం ధ్రకు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని, ఇది తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందున రాజీనామా చేస్తున్నట్లు కొండా సురేఖ, ఠాకూర్‌ రాజ్‌కుమార్‌, కేకే మహేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లో వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణాకు వైసిపి వ్యతిరేకమనే భావన వ్యక్తం అయిందన్నారు. చరిష్మా ఉన్న నేతలను బయటకు పంపడమే ప్రధాన ఎజెండాగా వైసిపి ప్రయత్నిస్తోందన్నారు. సీమాంధ్రకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం తమ ఆత్మాభిమానంపై దెబ్బతీసినట్లుగానే ఉందన్నారు. దీంతో పార్టీ వైఖరిపై పట్టుబట్టామని, అయితే వారు విడుదల చేసిన నాలుగు పేజీల లేఖలో సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం అయిందన్నారు. పార్టీ తెలంగాణాకు వ్యతిరేకంగా ఉందనే విషయం స్పష్టమైందన్నారు. నీళ్లు, నిధులు, శ్రీశైలం డ్యాం, కృష్ణా డెల్టా నీరు తదితర అంశాలు తెరపైకి తెచ్చిందన్నారు. ఇవన్నీ కూడా తెలంగాణాకు వ్యతిరేకమనే భావన కలుగుతుందన్నారు. తాము వద్దని చెప్పినా కూడా లేఖను బయటకు వదిలారంటే తమలాంటి వారికి గౌరవం లేదని తేటతెల్లం అయిందన్నారు. ఎమ్మెల్సీకి కొండా మురళీ ఏ విధంగా అనర్హుడో చెప్పాల్సినవసరం వైసిపికి ఉందన్నారు. నిన్నటికి నిన్న సీమాంధ్రకు చెందిన ప్రతినిధులు రాంచంద్రారెడ్డి తదితరులు కేకే మహేందర్‌రెడ్డి పార్టీని వీడుతుంటే ఆల్‌ది బెస్ట్‌ చెప్పాడంతే పార్టీలో జనాకర్షక నేతలను బయటకు పంపేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదనితేలిపోయిందన్నారు. ఆనాడే వైఎస్‌కు అనుంగు వ్యక్తిగా ఉన్న సూరి బయటకుపోతూ పోతూ చెప్పిన మాటలు తనకు గుర్తుకు వచ్చాయని సురేఖ నెమరు వేసుకున్నారు. జగన్‌ ఏనాడూ కూడా తెలంగాణ అంశం తెరపైకి తెస్తే చర్చించిన దాఖలాలు లేవన్నారు. దాటవేస్తూనే వెళ్లేవారన్నారు. తెలంగాణా వస్తున్న సమయంలో బయటకు వస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు సురేఖ. జగన్‌తోపాటు సురేఖ వేదికపైన ఉంటే ఆయనకంటే ఎక్కువ సురేఖకు మద్దతు వస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోయారన్నారు. వైఎస్సార్‌ సిపి కేవలం ఓట్లు, సీట్లకోసమే పనిచేస్తుందని తేలిపోయిందన్నారు. కేకే మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ నికార్సైన తెలంగాణా వాదులుగానే తాము బయటకు వచ్చామని, మిగతా తెలంగాణా నేతల గూర్చి తాము మాట్లాడదలుచుకోలేదన్నారు. ఎవరి రాజకీయాలు వారివని, వారు తీసుకునే నిర్ణయాలను బట్టి వారి భవిష్యత్‌ ఉంటుందన్నారు. తాము మాత్రం తెలంగాణా పునర్నిర్మాణంలో బాగస్వాములు కావాలనుకుంటున్నామని, ఇందుకోసమే బయటకు రావడం జరిగిందన్నారు. తమను విమర్శించేవారినికాని, తెలంగాణాకు వ్యతిరేకంగా ఉన్నవారిపట్ల కూడా తాము ప్రతివిమర్శ చేయబోమన్నారు. ఇప్పటికిప్పుడైతే ఏపార్టీలో చేరాలనేది నిర్ణయించుకోలేదన్నారు. తెలంగాణాపై యూటర్న్‌ తీసుకున్న మాట మాత్రం వాస్తవమన్నారు. తెలంగాణాకు వ్యతిరేకంగా ఉన్నందునే తాము మాత్రం రాజీనామా చేస్తున్నామన్నారు. తమపై విమర్శలు గుప్పిస్తే మాత్రం ఊరుకోబోమన్నారు.