కొంచెం నీరు.. కొంచెం నిప్పు రెండు రాష్ట్రాలేర్పడినా తెలుగు జాతి సమైక్యంగుండాలి

మా రాజధానికి నాలుగైదు లక్షల కోట్లివ్వాలి
ప్రాణహిత`చేవెళ్లను కూడా జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి : చంద్రబాబు
హైదరాబాద్‌, జూలై 31 (జనంసాక్షి) :
తెలుగు వారికి రెండు రాష్ట్రాలున్నా, జాతి సమైక్యంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కోరారు. రాష్ట్రం విడిపోయినందుకు తనకెంతమాత్రం ఆవేదన లేదని, అయితే తెలుగు జాతి మాత్రం సమైక్యంగా ఉండాలనేదే తన అభిప్రాయమని టిడిపి అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌తో సమానంగా సీమాంధ్రలో రాజధానిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న అన్ని కర్మాగారాలు, ఐటీ కేంద్రాలు, విమానాశ్రయాలు, తెలుగువారికోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. తెలుగుజాతికి పూర్వవైభవం వచ్చేందుకు, ఆనందంగా ఉండేందుకు తాముపోరాటం చేస్తామన్నారు. తాను రాజకీయం చేయదలుచుకోలేదన్నారు. రాజధాని నిర్మాణానికి కనీసం నాలుగైదు లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని పార్టీలతోను, రాష్ట్రంలోని పార్టీలతోను చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తెలుగుజాతిని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. కొత్త రాష్ట్ర కేంద్రం ఎక్కడ చేస్తారో నిర్ణయించాలని కేంద్రాన్ని బాబు డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌కు ఏఐసీటీఈ లాంటి భారీ సంస్థను మంజూరు చేయాలన్నారు. ఇంకా ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. 2008లో రాష్ట్రంలోని ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే లేఖ ఇవ్వడం జరిగిందని, దీనికి కట్టుబడి ఉన్నామన్నారు. ఉద్యోగాలు, నీళ్లు, భూములు సమకూర్చాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం త్వరగా కమిటీ వేసి ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని బాబు డిమాండ్‌ చేశారు.పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినందుకు ఆనందంగానే ఉన్నప్పటికి నిధులు కేటాయించడంలో ఎందుకు ప్రకటించలేదన్నారు. దానికి తోడుగా ప్రాణహిత` చేవెల్ల ప్రాజెక్టుకు కూడా జాతీయ ప్రాజెక్టు హోదాకల్పించాలని బాబు డిమాండ్‌ చేశారు. ఏ ఒక్కప్రాంతానికో చెందిన వ్యక్తిగా తాను వ్యవహరించడం లేదన్నారు. తెలుగు జాతిగా ఉంటే రెండు రాష్ట్రాల్లో సమానమైన అభివృద్ధి చేపట్టాలని మాత్రమే డిమాండ్‌ చేస్తున్నానన్నారు. ఈరోజు రాజకీయాలు మాట్లాడ దలుచుకోలేదని, కేంద్రనికి  కొన్ని డిమాండ్లు మాత్రమే ముందుంచామన్నారు.వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నాలు ఏవిధంగా చేస్తారో చెపితే చాలన్నారు. ఇంకా ఈసమస్య పూర్తి కాలేదని, రాజకీయాలు, పార్టీల చరిత్ర, తదితర అంశాలపై ఇంకా ఇంకా మాట్లాడుకోవాల్సి ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీలా తాను రాజకీయం చేయదలుచుకోలేదన్నారు. ఉద్యోగాలు, విద్యుత్‌, నీటి పంపిణీ, భూముల సేకరణ తదితర అంశాలపై నమ్మకం కలిగించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆత్మహత్యలు ఆపాలని పిలుపునిచ్చారు. ఆత్మహత్యలు అసలు పరిష్కారం కానేకాదన్నారు. తెలంగాణా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది దిగ్విజ్‌సింగే చెప్పారన్నారు. కొత్త రాజధానిలో కేవలం సెక్రటేరియట్‌ అసెంబ్లీ నిర్మించుకుంటే సరిపోదన్నారు. హైదరాబాద్‌, చెన్నై తదితర పట్టణాల్లాగే కొత్త రాజధానిని నిర్మించి ఆప్రాంతం వారిలో కూడా నమ్మకం కలిగించాలన్నారు. అనివార్య కారణాల వల్ల విడిపోయినప్పటికి కలిసి ఉండి అబివృద్ది చెందేందుకు ప్రయత్నించాలన్నారు. తెలుగు జాతి సమస్యలు రెండు రాష్ట్రాల్లో ఎదుర్కొనే వాటన్నింటిపై కేంద్రంతోను, యూపీఏ బాగస్వామ్య పక్షాలతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తానన్న మాటకు కేంద్రం కట్టుబడి ఉండాలన్నారు. రాజకీయాల గురించి తాను మాట్లాడదలుచుకోలేదంటుంటే మీడియా ప్రశ్నలు గుప్పించడంతో అసహనానికి గురయ్యారు. ఇంకా ఇప్పుడే అయిపోలేదు రేపు ఎల్లుండి ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుకుందామన్నారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు రాజకీయ లబ్ధి పొందేందుకు ఆడుతున్న డ్రామాలు చెప్పాల్సి ఉందని, ఓవైపు రాష్ట్రం విడిపోతుంటే ఒక్కరోజు ముందే విజయశాంతిని కాంగ్రెస్‌లో కలుపుకుంటూ సీటిచ్చేందుకు చర్చలు జరుపడం దారుణం కాదా అన్నారు. ఇంకా అనేక విషయాల గురించి మాట్లాడే అవకాశం ఉందన్నారు. ఆత్మహత్యలు దారుణమన్నారు. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారని ఇది భాదాకరమన్నారు. ఏఒక్క సీమాంధ్ర వ్యక్తి కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన పిలుపునిచ్చారు.  రెండు ప్రాంతాల నేతలతో సమావేశాలు నిర్వహించి పలు అంశాలపై చర్చించాల్సి ఉందన్నారు. ఇప్పటికైతే నూతన రాజధాని ఏర్పాటు, రాజధానికి కావాల్సిన నిధులు, బూములు, తదితర అంశాలపై నిగ్గు తేల్చాలన్నారు.