తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు


– కళకళలాడుతున్న జలాశయాలు   – ఎస్సారెస్పీ గేట్లు ఎత్తివేత
– ఆదిలాబాద్‌లో వరదలో చిక్కుకున్న ఎన్నికల సిబ్బంది
హైదరాబాద్‌, ఆగస్ట్‌ 1 (జనంసాక్షి)
తెలంగాణ అంతటా విస్తారంగా వర్షా లు కురుస్తున్నాయి. బుధవారం నుం చి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షా లతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. అటు మహారాష్ట్రలో కురుస్తు న్న భారీ వర్షాలతో గోదావరికి వరద ఉద్ధృతి పెరిగింది.  దీంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో 1.25 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 35 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1090.45 అడుగులుగా ఉంది. ఆదిలాబాద్‌ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వరద రావడంతో కడెం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో 95 వేల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 1.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జిల్లాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేశారు. ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఎన్నికల సిబ్బంది వరదల్లో చిక్కుకున్నారు. వీరిలో 20 మంది కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. దహేగాం మండలంలోని 14 గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. భారీ వరద రావడంతో కొమురం భీమ్‌ ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. వట్టివాగు ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేశారు. ఎడతెరిపి లేని వర్షాలతో సిర్కూర్‌-కౌటాల ప్రధాన రహదారిపై తొటిచెట్టు వొర్రె ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జైనాథ్‌, బేల మండలాల్లో వాగులు పొంగడంతో 84 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. నిజామాబాద్‌ జిల్లాలో నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో 26 గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుత నీటి మట్టం 1001 అడుగులుగా ఉంది. కరీంనగర్‌ జిల్లాలో భారీ వర్షాలు కురియడంతో రాయపట్నం బ్రిడ్జిపై నుంచి గోదావరి నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆదిలాబాద్‌-కరీంనగర్‌ జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి పెరుగుతోంది. మొన్నటివరకూ తగ్గిపోయిన గోదవారి నీటిమట్టం గురువారం ఉదయానికి 43 అడుగులకు, మధ్యాహ్నానికి నీటిమట్టం 47 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటిమట్టం సాయంత్రానికల్లా మూడో ప్రమాద హెచ్చరికను చేరుకొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాతో రామగుండం డివిజన్‌లోని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. క్వారీల్లోకి అధికంగా నీరు వచ్చి చేరడంతో యంత్రాలు నడిచే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. జలాశయాలన్నీ నిండుకుండల్లా మారాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద వస్తుండడంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ ఉప్పొంగుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 882.30 అడుగులకు చేరింది. గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 3.41 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 4.72 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో నాగార్జన్‌సాగర్‌ రిజర్వాయర్‌ నీటిమట్టం పెరుగుతోంది. ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి ఎక్కువైంది. ప్రస్తుత నీటిమట్టం 540 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 4.72 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 17 వేల క్యూసెక్కులగా ఉంది. ప్రాజెక్టులో నీరు గరిష్ట మట్టానికి చేరుతుండడంతో శుక్రవారం కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేయనున్నారు.