నిర్ణయమైపోయింది


ఆందోళనలు చేస్తే కేసులే
ఎంపీ ఉండవల్లి
న్యూఢిల్లీ, ఆగస్ట్‌ 1 (జనంసాక్షి) :
తెలంగాణపై నిర్ణయ మైపోయింది.. ఇప్పుడు ఆందోళనలు చేస్తే కేసులు  ఎదుర్కోవడం మినహా మరేమి ఉండదని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని చెప్పారు. తాము హైదరాబాద్‌ ఆధారంగానే విభజనకు ఒప్పుకోవడం లేదని తెలిపారు. సీమాంధ్ర నేతలమంతా సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలను ఆయన ఖండించారు. ఎక్కడైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు జరగాలని అభిలాషించారు. తమ పార్టీకి చందిన నేతల విగ్రహాలను కూల్చివేయడం శోచనీయమన్నారు. విగ్రహాలను కాల్చివేయడం వల్ల వచ్చే ప్రయోజనమేమీ ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఉండవల్లి గురువారం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ వల్లే తాము విభజనకు అంగీకరించడం లేదని చెప్పారు. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయాలనేది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ అభిప్రాయమని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉద్రిక్తతలు తగ్గించవలసిన అవసరం ఉందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఉద్రిక్తతలు నివారించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇందుకు మీడియా కూడా సహకరించాలని కోరారు. జాతీయ నేతల విగ్రహాలు ధ్వంసం చేసినందువల్ల వారిని అభిమానించే వారి మనోభావాలు దెబ్బతీయడమేనని, అంతకుమించి ఏవిూ జరగదన్నారు. ఆందోళనల వల్ల ఫలితం ఉండదని చెప్పారు. విధ్వంసాలకు పాల్పితే కేసులు వస్తాయని, అనవసరంగా వారే ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. ప్రజాభిప్రాయానికి తగినట్లుగానే ప్రభుత్వం నడవాలని, ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మాత్రమే సిఫార్సు చేసిందని.. రాష్ట్రం ఎలా ఏర్పడాలి, ఇతర సమస్యల పరిష్కారం ఏమిటన్న దానిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పడుతుందని, దానికి అన్ని విషయాలు చెబుదామని సీమాంధ్ర నేతలకు సూచించారు. విభజనపై లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ సమావేశాలు జరుగుతాయని, ప్రజాప్రతినిధులు అక్కడ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకోవచ్చన్నారు. ఏ రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఏ పార్టీ విప్‌ జారీ చేయలేదని ఆయన గుర్తు చేశారు.