లండన్, దుబయిలో తెలంగాణ సంబురాలు
లండన్, (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ, యూపీఏ భాగస్వామ్య పక్షాలు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో లండన్‌లో తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరం, ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్ సెల్ ఆధ్వర్యంలో వెస్ట్, సెంట్రల్, ఈస్ట్ లండన్‌లో గురువారం 50 కిలోమీటర్ల కార్ ర్యాలీ నిర్వహించారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు అనుకూల నిర్ణయం తీసుకునేందుకు కారకులైన తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఇది ఉద్యమకారుల విజయమేనని పేర్కొన్నారు. ఈస్ట్ లండన్‌లో ఉదయ్ నాగరాజ్ ఆర్వహించిన అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వి. ప్రకాశ్ మాట్లాడుతూ 45 రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని, తెలుగు వాళ్లకు రెండు రాష్ట్రాలు, ఇద్దరు గవర్నర్లు ఉంటారని తెలిపారు. ఉమ్మడి రాజధాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని తెలిపారు. అనిల్ కూర్మచలం మాట్లాడుతూ, పార్లమెంట్‌లో బిల్లు పెట్టే వరకూ ఉద్యమాన్ని కొనసాగించాలని కోరారు. గంప వేణుగోపాల్ మాట్లాడుతూ వెయ్యి మంది అమరుల త్యాగ ఫలమే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అని, ఇది వారికే అంకితమని తెలిపారు. తెలంగాణ ఉద్యమం చేసిన వారికే గౌరవం దక్కాలని, ఉద్యమంలో పాలు పంచుకోకుండా వంట మొత్తం అయ్యాక చివరికి గంటె తిప్పే వారికి కాదని సిక్క చందు అన్నారు. కార్యక్రమంలో ఎడ్లబండి చారి, శ్రీకాంత్ పెద్దిరాజు, వసుమల్ల కిరణ్, వంశీరెడ్డి, మంద సునీల్, హరి, రోహిత్, సతీశ్, నగేశ్, చిత్తరంజన్, రంగుల సుధాకర్, రంగు వెంకట్‌తో పాటు పెద్ద సంఖ్యలో తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు.
ఇట్కా ఆధ్వర్యంలో…
దుబయి : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ సానుకూల నిర్ణయం ప్రకటించడంతో ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. వారి త్యాగనిరతితోనే తెలంగాణ సాధ్యమయిందని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సాధన కోసం జీవితాంతం సాగించిన కృషితోనే భావజాల వ్యాప్తి జరిగి తెలంగాణ సాధించుకోగలిగామని అన్నారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పీచర కిరణ్‌కుమార్ మాట్లాడుతూ, నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను ఓపిక, సహనంతో సాధించుకున్నారని, ఈ క్రమంలో ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించారని అన్నారు. తెలంగాణ ఉద్యమ వ్యాప్తిలో కవులు, కళాకారులు, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకుల కృషి అభినందనీయమన్నారు. ప్రజల అభీష్టాన్ని, పోరాటాన్ని గుర్తించి పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేసిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత దుబయిలో విజయోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కొండం అశోక్‌రెడ్డి, మామిడి శ్రీనివాస్‌రెడ్డి, పీచర వెంకటేశ్వర్‌రావు, మ్యాదం మహేశ్వర్, కొండ శ్రీనివాస్, గాందారి సత్యనారాయణ, పడాల లింగారెడ్డి, రేశం స్వామి, సంపత్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్, ర్యాపని రమేశ్, నరేశ్, సాయిచందర్, అంజి తదితరులు పాల్గొన్నారు.