మెజార్టీ సీమాంధ్రులు రాజీనామాకు నో


పీసీసీ చీఫ్‌కు కొందరి రాజీనామా లేఖలు
కేంద్రంలో ఎంపీలు, మంత్రులది అదే పరిస్థితి
హైదరాబాద్‌, ఆగస్ట్‌ 1 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో రాజీనామా చేసేందుకు మెజార్టీ నాయకులు ససేమిరా అంటున్నారు. కొందరు ప్రజల కోరిక మేరకు రాజీనామా చేశామని చెప్తున్న వారెవరూ స్పీకర్‌ ఫార్మాట్లో రాజీనామాలు ఇవ్వలేదు. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు రాజీనామా లేఖలు పంపారు. రాజీనామాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య విభేదాలు నెలకొన్నాయి. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక వర్గంగా, ఎంపీలు మరో వర్గంగా విడిపోయారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ఢిల్లీలోనే మకాం వేసి రాష్ట్ర పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు. మరోవైపు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏకమై రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. అయితే, వారిలోనూ భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. విభజనను అడ్డుకొనేందుకు రాజీనామాలకు సైతం సిద్ధపడాలని పలువురు నేతలు పట్టుబడుతుండగా, నిర్ణయం జరిగిపోయింది కనుక రాజీనామాలు అనవసరమని మరికొందరు పేర్కొంటున్నారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మూకుమ్మడి రాజీనామాలు చేయాలని పలువురు నేతలు నిర్ణయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలా మంది ఈ నిర్ణయానికి రాగా, మరికొందరు మాత్రం రాజీనామాలు వద్దని వారిస్తున్నారు. హైకమాండ్‌ ఆందోళనల వల్ల ఫలితం లేదని, సమయాన్ని వృథా చేసుకోకుండా సీమాంధ్రను ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆలోచించాలని కోరుతున్నారు. రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, మంత్రి రామచంద్రయ్య తదితరులు ఈ వాదనను వినిపిస్తున్నారు. అయితే, వీరి వాదనతో మిగతా వారు ఏకీభవించడం లేదు. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయిందని, ఇప్పుడైనా మేల్కొనకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని మంత్రులు శైలజానాథ్‌, టీజీ వెంకటేశ్‌, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి తదితరులు పేర్కొంటున్నారు. మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేసి, సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటామని వెల్లడించారు. ఆందోళనలు, ఉద్యమాల వల్ల ఫలితం లేదని మంత్రి సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ వెనక్కు వెళ్లే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. ఆందోళనలతో సమయాన్ని వృథా చేయకుండా, సీమాంధ్రను ఎలా అభివృద్ది చేసుకోవాలన్న దానిపై దృష్టి పెట్టాలని ఆయన సీమాంధ్ర నేతలకు, ప్రజలకు సూచించారు. అందరూ కూర్చొని ఏది రాజధాని కావాలి, భూమి ఎక్కడ అందుబాటులో ఉంది, ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలన్న దానిపై చర్చించాలన్నారు. వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం, వాన్‌పిక్‌ ప్రాంతాన్ని పరిశ్రమలకు వాడుకోవాలన్నారు. వీటన్నంటికంటే ముందు కేంద్రం నుంచి మంచి ప్యాకేజీ సాధించుకోవడానికి యత్నించాలని సూచించారు. మరోవైపు ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా సమైక్యాంధ్ర నేతల సమావేశానికి డుమ్మా కొట్టారు. అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటామని వారు పేర్కొన్నారు.