కృత్రిమ డ్రామాలాపండి


మీ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించండి
టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
హైదరాబాద్‌, ఆగస్టు 1 (జనంసాక్షి) :
సీమాంధ్ర నేతలు కృత్రిమ రాజీనామా డ్రామాలు ఆపాలని, మీ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పై కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పార్లమెంటులో బిల్లు పెట్టేముందు తెలంగాణ ప్రాంత హక్కులను పరిరక్షించే విధంగా కేంద్ర నాయకత్వ ముఖ్య భూమికను పోషించాలని ఆయన కోరారు. గురువారం బీజేపీ కార్యాలయంలో జేఏసీ నేతల బృందం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, నల్లు ఇంద్రసేనారెడ్డి, లక్ష్మినారాయణ, సి.అశోక్‌కుమార్‌ యాదవ్‌ను కలిశారు. సుదీర్ఘ పోరాటాలు, ప్రాణత్యాగాలు తర్వాత కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడం తెలంగాణ ప్రజల విజయంగా జేఏసీ నేతలు అభివర్ణించారు. అనంతరం జేఏసీ నేతలు దేవిప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌, విఠల్‌, చైర్మన్‌ కోదండరామ్‌, అద్దంకి దయాకర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌ విషయంలో అనేక అపోహలున్నాయన్నారు. కేంద్ర పాలిత ప్రాంతం, ఉమ్మడి రాజధాని అన్నవి వస్తున్నాయని వాటిని నివృత్తి చేయాలని కోరినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో నివసించే అన్ని ప్రాంతాల వారికి రక్షణ కల్పిస్తామన్నారు. ఏ ఒక్కరు భయందోళనకు గురి కావద్దన్నారు. నీటి పంపకం, విద్యా, ఉద్యోగాలు, తదితర అంశాలపై ఇరుప్రాంతాల వారికి సమ న్యాయం జరిగే విధంగా చూడాలని కోరినట్లు చెప్పారు. సీమాంధ్ర ప్రాంతాల వారు రాజధాని నిర్మించుకునేవరకు హైదరాబాద్‌ కామన్‌ క్యాపిటల్‌గా ఉండడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే ఉమ్మడి రాజధాని అన్న విషయంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాంతాలు వేరైనా అన్నదమ్ముల మధ్య బేధాభిప్రాయాలు రావద్దన్నారు. సీమాంధ్రులు చేసేది కృత్రిమ ఉద్యమమని, తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసిన దానిలో ఒక్క శాతం దృష్టి దానిపై పెడితే ఉద్యమం సద్దుమణుగుతుందన్నారు. సీమాంధ్ర ప్రాంత అభివృద్ధిపై నేతలు దృష్టి సారించాలే తప్ప అనవసరంగా ప్రజలను రెచ్చగొట్టవద్దని సూచించారు.