లేఖలిచ్చారు.. ఈ డ్రామాలేంది?


సీమాంధ్ర పార్టీల నిబద్ధతను నిలదీసిన ఈటెల
హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని లేఖలు ఇచ్చారు.. ఇప్పుడు రాజీనామా డ్రామాలు ఏమిటని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ ప్రశ్నించారు. సుదీర్ఘ పోరాటాల వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పటికిప్పుడు ఉద్యమం వచ్చిందో, రాష్ట్రం రానే రాలేదని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 1956 నుంచి రాష్ట్రం కోసం పోరాటాలు కొనసాగుతునే ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన వెలువడగానే సీమాంధ్ర నేతలు పార్టీలకతీతంగా మరోసారి రాజీనామాల డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. 2009 డిసెంబర్‌ 10న ఆడిన డ్రామాలే కాంగ్రెస్‌, టీడీపీ, వైఎస్సార్‌సీపీలు ఆడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణకోసం సకలజనుల సమ్మెతోపాటు రోడ్ల దిగ్బంధాలు, ప్రాణత్యాగాలు చేసిన రోజులు ఎందుకు గుర్తుకు రావడం లేదని ఆయన సీమాంధ్ర నేతలను నిలదీశారు. టిడిపి అధినేత నిన్నటికి నిన్న తెలంగాణ రావడం పట్ల స్వాగతిస్తూనే నూతన రాజధాని నిర్మాణానికి ఐదు లక్షల కోట్ల రూపాయలు కావాలని పట్టుబట్టి కనీసం ఇరవై నాలుగు గంటలు కూడా గడువక ముందే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారని ఈటెల బాబును నిలదీశారు. 2008లో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది, కట్టుబడి ఉన్నది వాస్తవమే అయితే ఇప్పడు విూ పార్టీ నాయకులు ఆడుతున్న రాజీనామాల డ్రామాలు ఏం అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. పార్టీ అంటే ఒకే ఎజెండా ఉండాలి కదా అది ఎందుకు విూపార్టీలో అమలు కావడం లేదని ఈటెల బాబును నిలదీశారు. ఎందుకుఆపటం లేదన్నారు. అంటే మరోసారి రెండు కళ్ల సిద్ధాంతాన్ని అమలు చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో స్థానం మాత్రం సంపాదించుకోవడం ఇక సాద్యం కానేకాదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఇహ కాంగ్రెస్‌ పార్టీ గత నాలుగేళ్లుగా అసెంబ్లీ లో చర్చకు పట్టుబడితే హైకమాండ్‌ చెప్పితే చేస్తాం, తీర్మానం పెట్టమంటే పెడతాం అని గంటా బజాయించినట్లు చెపుతూ వచ్చిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు చివరాకరికి సీఎం నేడు ఏంచేస్తున్నారని ఈటెల నిలదీశారు. కాంగ్రెస్‌ పార్టీ నేడు రాష్ట్రం ఏర్పాటు చేసేందుకు తీర్మాణం చేస్తే నేడు వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. పార్టీకి కట్టుబడి ఉండడం అంటే ఇదేనా అని నిలదీశారు. నిన్నమొన్నటి వరకు నిండు అసెంబ్లీలో చెప్పిన మాటలు పచ్చిబూటకమేనా అని ఆయన ప్రశ్నించారు. వైసిపి తెలంగాణాలో తమకు ఎలాగూ స్థానం లబించే అవకాశం లేదని గుర్తించి ప్రకటనకు ముందే తోక ముడుచుకుని సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారన్నారు. తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేయడమేకాక నేడు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతుందన్నారు. తెలంగాణ ప్రజల పోరాటాలు, ఆరాటం సీమాంధ్ర ప్రజలకు తెలియవా అని ఈటెల పేర్కొన్నారు. ఎంతమంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నది మీరుకళ్లారా చూడలేదా అన్నారు. ఈతరుణంలో కొంతమంది పెట్టుబడి దారులు ఆడుతున్న నాటకాల్లో మీరు బాగస్వాములు కావద్దని పిలుపునిచ్చారు. నీళ్లు, ఉద్యోగాల విషయంలో అనుమానాలుంటే నివృత్తిచేసుకునేందుకు ఓ పద్ధతి ఉంటుందన్నారు. 14 రాష్టాల్రు ఏర్పడినప్పుడు ఏం చేశారో అదే తెలంగాణాలోను చేస్తారన్నారు. ఇక్కడి వారు విూది మాకు కావాలని కోరడం లేదన్నారు. మాది మాకు ఉంటే సరిపోతుందన్న భావనతోనే ఉన్నామన్నారు. తెలంగాణా ఉద్యమం సమయంలో పోలీసులు తమను ఏవిధంగా ముప్పు తిప్పలు పెట్టారో కళ్లారా చూశామని, అదే పోలీసులు ఇదే ప్రభుత్వం సీమాంధ్రలో ఎందుకు అలా వ్యవహరించడం లేదని ఈటెల నిలదీశారు. ఇప్పుడు కూడా వివక్షేనా అని ఈటెల నిలదీశారు. మీడియా కూడా ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు రాస్తూ చూపిస్తూ తెలంగాణ ప్రజలను, ఉద్యమకారులను ఎంత అవమాన పరుచాలో అంతే చేసిందన్నారు. ఇప్పటికి కూడా ఆ విష ప్రచారాన్ని ఆపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల కల సాకారం అవుతుంటే నేడు విష ప్రచారం చిమ్ముతూ పార్టీనే కలిసిపోతుందని, ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని ఇంకేదో ఇంకేదో చూపిస్తూ, రాస్తూ విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. మీడియాలో ఉన్న నిబద్దత, రూల్స్‌ అన్నీ పాటించినట్లయితే ఈదుష్ప్రచారాన్ని వెంటనే నిలిపి వేయాలని ఈటెల డిమాండ్‌ చేశారు. 13 సంవత్సరాలుగా ఎంత దుర్మార్గానికి ఒడిగట్టాలో అంత చేసినా కూడా కేవలం తెలంగాణా ప్రజల సమష్టిపోరాటాల పలితంగానే  సాధించుకోగలిగామన్నారు. తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించడం జరిగిందన్నారు. కేసీిఆర్‌ను నేడు తెలంగాణా గాంధీగా అభివర్ణిస్తున్నారని, తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజాప్రతినిధులను, ప్రజలను విముక్తి చేసిన ఘనత టీఆర్‌ఎస్‌కు దక్కిందన్నారు. తెలంగాణ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న లగడపాటి వెంటనే ఆ పని చేయాలని ఈటెల సవాల్‌ విసిరారు.