సీమాంధ్రుల ఆగడాలు


జాతీయ నాయకులకు విగ్రహాల ధ్వంసం
తక్షణమే అరస్ట్‌ చేయాలని సీఎం హుకుం
హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) :
సమైక్యాంధ్ర కోసమంటూ సీమాంధ్రులు రెచ్చిపోతున్నారు. రోడ్డుపై కనిపించిన జాతీయ నాయకుల విగ్రహాలను ఇష్టం వచ్చినట్లుగా ధ్వంసం చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఎంతమాత్రం ఉపేక్షించవద్దని, వెంటనే అరెస్టు చేయాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హుకుం జారీ చేశారు. రాష్ట్రంలో ఆందోళనలు, నిరసనలు తెలుపుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, అయితే ఆ తరుణంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం కఠిన చర్యలుంటాయని  కిరణ్‌ హెచ్చరించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి డిజిపి దినేష్‌రెడ్డి, సిఎస్‌ మహంతితో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వారిని తక్షణమే అరెస్ట్‌ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడంగాని, నిప్పు పెట్టడం గాని చేస్తే పోలీసులు వారిపని వారు చేస్తారన్నారు. ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ఆందోళనలు చేసుకుంటే ఎవ్వరూ అడ్డుకోరని సీఎం పేర్కొన్నారు. ఆందోళనల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే కూడా ఊరుకోబోమన్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి సీఎస్‌ను, డీజీపీని ఆదేశించారు. అన్ని జిల్లాల ఎస్పీలతో సంప్రదించి చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు రబ్బర్‌ బుల్లెట్లు వాడొద్దని ఆదేశాలు జారీచేయాలని సీఎం డీజీపీని కోరారు. ప్రభుత్వ ఆస్తులను, విగ్రహాలను ధ్వంసం చేయొద్దని ముఖ్యమంత్రి ఆందోళన కారులకు విజ్ఞప్తి చేశారు.