నో ఆప్షన్‌ సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాల్సిందే


తెలంగాణ బిల్లు పెట్టేవరకూ అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆంధ్రాకు చెందిన ఉద్యోగులంతా తప్పకుండా సీమాంధ్రకు వెల్లిపోవాల్సిందేనని ఇందులో ఇంకో ఆప్షన్‌ లేనే లేదని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు. టీఎన్‌జీఓలు కార్యవర్గ సమావేశం అనంతరం తెలంగాణ భవన్‌కు వచ్చి కేసీఆర్‌ను అభినందించారు. ఈసందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ అక్కడి ప్రభుత్వం నడవాలంటే ఉద్యోగులు కావాలి కాబట్టి ఆందరు వెళ్లాల్సిందేనన్నారు. రెండు ప్రాంతాల్లో ప్రభుత్వాలు నడవాలంటే ఉద్యోగులు చాలా ముఖ్యపాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు చాలా నష్టపోయారన్నారు. ఆ నష్టాన్ని తాము భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. తెలంగాణ వచ్చినంక ఉద్యోగులపై ఉన్న కేసులను రద్దు చేసి పదోన్నతులు కల్పించి గౌరవిస్తామన్నారు. ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఉద్యోగులకు అన్నిరకాలుగా రిలీఫ్‌ ఇస్తామన్నారు. తెలంగాణ సాధనలో ఉద్యోగుల పాత్ర అనిర్వచనీయమైనదన్నారు. పెన్‌డౌన్‌ సమ్మెకాని, సకల జనుల సమ్మె వరకు అనేకరకాలుగా పోరాటాలు చేశారని అభినందించారు. సంబురాలు  జరుపుకోవడానికి ఇది సరైన సమయం కానేకాదన్నారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టి పాస్‌ అయ్యాక అంబరాన్ని అంటేలా ఉత్సవాలు నిర్వహించుకుందామన్నారు. అప్పటివరకు కూడా తెలంగాణవాదులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధానంగా ఉద్యోగులు ఇంకా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందన్నారు. సర్వీస్‌ మ్యాటర్స్‌, తదితర అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. సకలజనుల సమ్మె తన జీవితంలో మరిచిపోలేనన్నారు. ఇందులో సింగరేణి కార్మికులు సంఘాలకతీతంగా పనిచేసి ఒక్క బొగ్గు రవ్వను కూడా బయటకు రాకుండా నిలిపి వేశారన్నారు. ఉద్యోగులకు ముందే చెప్పినట్లుగా ప్రత్యేక ఇంక్రిమెంట్‌ ప్రకటిస్తామన్నారు. ఇప్పుడే విముక్తి పొందుతున్నామని, నిజంగా ప్రతిసెక్షన్‌ ప్రజల మొహాల్లో వెలుగులు, ఆనందం చూసేవరకు తమ పాత్ర తగ్గిపోదన్నారు. చిరునవ్వుల తెలంగాణాను చూసే వరకు తాను విశ్రమించపోనన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరిని రెగ్యులరైజ్‌ చేస్తామన్నారు. ఇంతకాలం అన్యాయానికి గురైన ఉద్యోగులకు న్యాయం చేసేందుకు పదోన్నతులు కల్పించి, సర్వీస్‌ మ్యాటర్స్‌లో ఉన్న కేసులను రద్దుచేస్తామన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా నిలిపేందుకు శాయశక్తులా కృషిచేస్తామన్నారు. ఇందులో కూడా ఉద్యోగుల పాత్ర అవసరం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదన్నారు. తాను ఆంధ్రా ఉద్యోగులను జాగో బాగో అననే లేదని, కొన్ని విషపుత్రికలు, మీడియా చానళ్లు మాత్రమే దుష్ప్రచారం చేశాయన్నారు. ఆయన తన ఆమరణ దీక్షలో ఉద్యోగుల పాత్రను నెమరు వేసుకున్నారు. ఉద్యోగ గర్జన పెడితే ఉద్యోగులు ఎంత బ్రహ్మాండంగా కృషిచేశారన్నారు. తాను చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాల నేత స్వామిగౌడ్‌ దండం పెట్టి ఉద్యమం విరమించాలని, నీ ప్రాణాలు మాకు కావాలని కోరినట్లు గుర్తు చేశారు. నిమ్స్‌లో అప్పటికి తనలో ఉన్న సత్తువంతా పోయిందని, తనకు తానే పరీక్షించుకున్న క్షణాలను మరిచిపోలేనన్నారు. ఇందులో స్వామిగౌడ్‌తో పాటు పలువురు ఉద్యోగులు తన వెంట పడి విరమించాలని ప్రాదేయ పడ్డారని గుర్తు చేశారు.