ఈ విజయం జయశంకర్‌ సార్‌కే అంకితం


ఘనంగా సార్‌ జయంతి వేడుకలు నిర్వహిద్దాం : కోదండరామ్‌
హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రజలంతా కలిసి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రం ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌కే అంకితమని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. వచ్చిన తెలంగాణాను అడ్డుకోవాలని చూస్తున్న సీమాంధ్ర నేతలు ఇకనైనా తమవైఖరిని మానుకోవాలని ఆయన హితవు పలికారు. అమరవీరుల కుటుంబాలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ తెచ్చుకోగలిగిన వాల్లకు అమలు చేయించుకోవడం కూడా తమకు తెలుసన్నారు. ఎవ్వరు అడ్డుపడినా కూడా ఆగదని గుర్తుంచుకోవాలన్నారు. బావోద్వేగాలకు గురై తాము తెలంగాణ అడుగడం లేదన్నారు. తెలంగాణను అమలు చేయించే బాద్యతను తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తీసుకోవాలన్నారు. సీమాంధ్రలో కొనసాగుతున్న కృత్రిమ ఉద్యమాల వల్ల నేడు తెలంగాణ ప్రజల్లోకూడా మరోసారి అనుమానాలు కలుగుతున్నాయన్నారు. అయితే ఈసారి మాత్రం అడ్డుకోవడం ఎవరి తరం కానేకాదన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఏనాటి నుంచో ఉద్యమాన్ని నిర్వహిస్తూ వచ్చి అమరుడైన ప్రొఫెసర్‌ జయశంకర్‌ సారు జయంతి సందర్భంగా ఈనెల ఆరో తేదీన తెలంగాణ వ్యాప్తంగా గల్లీగల్లీనా ర్యాలీలు నిర్వహించి ఘనమైన నివాళులర్పించాలని కోదండరామ్‌ పిలుపునిచ్చారు. అప్పుడే సార్‌కు ఘనమైన నివాళులు అందుతాయన్నారు. తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటం అంతా ఇంతాకాదన్నారు. తమలో ఉన్న సంఘటిత శక్తిని మరోసారి నిరూపించుకోవాలన్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర నేతలు ప్రజలు ఉద్యమాన్ని ఆపి తమకు సహకరించాలని కోదండరామ్‌ పిలుపునిచ్చారు. ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉందామని ఆయన సూచించారు. గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఉద్యోగాలు రావని తమకుమారులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇంకొకరు చేసుకోవద్దని నమ్మకం కలిగించేందుకు వారే జేఏసీగా ఏర్పడి ఉద్యమంలో పాలుపంచుకున్న పాత్రను మరువలేమన్నారు. తెలంగాణ ఉద్యమంలో అడుగు వేసినా తీసినా కూడా పోలీసులను పెట్టి అడ్డుకున్న ప్రభుత్వం నేడు సీమాంధ్రలో ఎందుకు ఆపని చేయడం లేదని నిలదీశారు. ఉద్యమంలో ఉన్న వారి వద్దకు ఒక్కశాతం పోలీసులను పంపించి కౌన్సెలింగ్‌ ఇచ్చినా ఉద్యమాలు ఆగిపోతాయన్నారు. ఆపని కాదు కదా కనీసం ఒక్కరంటే ఒక్క పోలీసు కూడా కనిపించడం లేదన్నారు. తమచుట్టూ ఒక్కకొక్కరికి పది మంది పోలీసులను పెట్టిన కిరణ్‌ ప్రభుత్వం నేడు ఆపని ఎందుకు చేయడం లేదని నిలదీశారు. ఎన్ని ఉద్యమాలు చేసినా ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ఆపలేరని గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. పెట్టుబడిదారులు చేస్తున్న ఉద్యమాల వల్ల సామాన్య ప్రజలే నష్టపోతారన్నారు. మీడియా కూడా చిలువలు పలువల్లా చూపిస్తూ ఉద్యమకారులను రెచ్చగొడుతుందని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఉన్న ఏఒక్కరిని కూడా తాము పోవాలని కోరడం లేదన్నారు. ప్రతిఒక్కరిని కూడా అక్కున చేర్చుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. తామైతే రెండుగా విడిపోయి కలిసి ఉందామనుకుంటున్నామన్నారు. శాంతియుతంగానే జీవించాలని, కలిసి బతుకాలని తాము భావిస్తున్నామని ఇందుకు ఏమాత్రం అంగీకరించినా కూడా ఉద్యమాలను వెంటనే నిలిపివేసి సహకరించాలని కోరారు. ఉద్యోగుల సంఘం ప్రతినిధి అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ సీమాంధ్ర మీడియా మరోసారి విషప్రచారం కక్కుతోందన్నారు. ఇది మంచి సంస్కృతి కానేకాదన్నారు. ఫోర్త్‌ ఎస్టేట్‌ అంటే సమాజంలో ఎంతో గౌరవం ఉందని దానిని నిలుపుకునేందుకు ప్రయత్నించాలని హితవు పలికారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారనే ప్రచారంపై కేంద్రం మరింత స్పష్టత ఇవ్వాలని దయాకర్‌ కోరారు. రెచ్చగొట్టేలా చేస్తున్న సీమాంధ్ర మీడియా తన విషప్రచారాన్ని ఆపివేయాలని లేకుంటే జరిగే పరిణామాలకు విూరే బాద్యత వహించాల్సి ఉంటుందన్నారు.