అన్ని పార్టీల ఒప్పుకున్నాకే అధిష్టానం నిర్ణయం


రాద్దాంతం వద్దు : పీసీసీ చీఫ్‌ బొత్స
హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటు ప్రకటనపై రాష్ట్రంలోని అన్ని పార్టీలు రాద్దాంతం చేస్తున్నాయని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ పార్టీని దోషిగా చిత్రీకరించవద్దని సూచించారు. అన్ని పార్టీలతో మాట్లాడిన తర్వాతే హైకమాండ్‌ నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్ర విభజనపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అసవరం లేదన్నారు. ఈ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. బొత్స శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో రాజకీయ పార్టీలు రాద్దాంతం చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ను దోషిగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. సున్నితమైన అంశంపై రాజకీయ లబ్ధి కోసం మాట్లాడడం బాధాకరమన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటనకు ముందు కాంగ్రెస్‌ అధిష్టానం నాలుగు దఫాలుగా అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. 2009లో రోశయ్య అధ్యక్షతన కమిటీ వేసిందని, 2010, 2011, 2012లలో కూడా కేంద్రం ఆధ్వర్యంలో పార్టీల అభిప్రాయాలు సేకరించిందన్నారు. తెలంగాణపై విూ నిర్ణయం చెప్పాలని కోరితే.. సీపీఎం, ఎంఐఎం మినహా అన్ని పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయాలు తెలిపాయన్నారు. తెలంగాణ వెనుకబడి ఉందని అందరూ కలిసికట్టుగా చెప్పారని గుర్తు చేశారు. అప్పుడు ఒకే చెప్పిన పార్టీలు ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం అనవసర రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. నిందను కాంగ్రెస్‌ హైకమాండ్‌ మీదకు వేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు మాట్లాడారంటే తెలియక అనుకోవచ్చని, కానీ రాజకీయ నేతలు అలా మాట్లాడమేమిటని ప్రశ్నించారు. సున్నిత అంశాల విషయంలో రాజకీయాలను పక్కన పెట్టాలని కోరారు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వకపోతే తాము ఇస్తామని బీజేపీ బాహాటంగా ప్రకటించిందని బొత్స గుర్తు చేశారు.
సంయమనం పాటించాలి
నిర్ణయం కొన్ని ప్రాంతాలకు బాధాకరమైన విషయమే అయినప్పటికీ అన్ని పార్టీల ఆమోదంతో విభజన జరుగుతోందన్నారు. సీమాంధ్ర ప్రాంతంలోనూ చాలా ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సంయమనం పాటించాలని కోరారు. ఈ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుందని.. కేంద్రం పరిష్కరిస్తుందన్నారు. ఈ విషయంలో ఎవరిది విజయం కాదని, అలాగని విఫలం కూడా కాదన్నారు. విలేకరులు కూడా సీమాంధ్ర ప్రాంతంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా చూడాలని కోరారు. శాంతియుతంగా నిరసనను తెలుపుకోవాలని, ఎక్కడ కూడా విధ్వంసాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. మన రాష్ట్రంలో హైదరాబాద్‌లో మాత్రమే అందరూ పెట్టుబడులు పెట్టారన్నారు. హైదరాబాద్‌ను సూపర్‌ హబ్‌గా తీర్చిదిద్దుకుందామని కోరారు. విభజన నిర్ణయం అధిష్టానం తీసుకున్నదే తప్ప తాము తీసుకున్నది కాదన్నారు. రాష్టాన్న్రి సమైక్యంగా ఉంచాలని తమ నివేదికలో కోరినట్లు వెల్లడించారు. తెలంగాణ అంశంపై తమను దోషిని చేయొద్దన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్ర ప్రాంతంలో కలపాలని హైకమాండ్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. శనివారం సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం కిరణ్‌తో సమావేశం కానున్నారని తెలిపారు.
వైఎస్సార్‌సీపీపై నిప్పులు
వైఎస్సార్‌సీపీపై బొత్స మరోమారు నిప్పులు చెరిగారు. ఆ పార్టీ ద్వంద్వ వైఖరి పాటిస్తోందని మండిపడ్డారు. తెలంగాణకు అనుకూలమంటూనే, సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేయడమేమిటని ప్రశ్నించారు. ప్రత్యేక వాదాన్ని లేవదీసింది ఎవరో? తెలంగాణ ఇవ్వాలని కోరింది ఎవరో? ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. స్వార్థం కోసం పుట్టిన వైఎస్సార్‌సీపీ కూడా తెలంగాణ ఏర్పాటుకు మద్దతునిచ్చిందని బొత్స తెలిపారు. ఇడుపులపాయ ప్లీనరీలో తెలంగాణ ఏర్పాటుకు అనకూలంగా ఆ పార్టీ నేతలు తీర్మానం చేశారని గుర్తు చేసిన బొత్స ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శింశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలంటూ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అప్పట్లో నలభై మంది ఎమ్మెల్యేలను సోనియాగాంధీ వద్దకు పంపించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. సీమాంధ్ర రాజధాని కోసం పెద్ద ఎత్తు డబ్బు డిమాండ్‌ చేయడాన్ని తప్పుబడతారా? అని విలేకరులు ప్రశ్నించగా లేదని బదులిచ్చారు.