ఉద్రిక్తతలొద్దు.. అన్నదమ్ముల్లా విడిపోదాం

సీఎం, పీసీసీ చీఫ్‌తో సమావేశం అనంతరం టీ కాంగ్రెస్‌ నేతలు
హైదరాబాద్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) :
రాష్ట్రంలో ఉద్రిక్తతలు సృష్టించొద్దు.. అన్నదమ్ముల్లా విడిపోదామని టీ కాంగ్రెస్‌ నేతలు కోరారు. శనివారం వారు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాల బాట పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. సీమాంధ్రలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రికి తాము సహకరిస్తామని ప్రకటించారు. రాష్ట్ర విభజనకు అడ్డుపడొద్దని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, ప్రజలను తెలంగాణ ప్రాంత నేతలు కోరారు. సీఎం కిరణ్‌తో తెలంగాణకు చెందిన ఏడుగురు మంత్రులు, కేంద్ర మంత్రితో పాటు నలుగురు ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శనివారం క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, బస్వరాజు సారయ్య, సుదర్శన్‌రెడ్డి, కేంద్ర మంత్రి బలరాం నాయక్‌, ఎంపీలు అంజన్‌కుమార్‌ యాదవ్‌, గుత్తా సుఖేందర్‌రెడ్డి, వి.హనుమంతరావు తదితరులు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని, అందుకు సీమాంధ్ర నేతలను ఒప్పించాలని వారు కిరణ్‌ను కోరారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం ఆమోదం పొందేలా చూడాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. సీమాంధ్రకు రాజధాని నిర్మాణం, వనరుల పంపిణీ వంటి అంశాల్లో తాము సహకరిస్తామని వారు పేర్కొన్నారు. సీమాంధ్రకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకుండా చూడాలని కోరారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలను నివారించేందుకు తమ వంతుగా సహకరిస్తామని హావిూ ఇచ్చారు.ఇదిలా ఉంటే, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు అటు పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణతో కూడా సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త్వరగా జరిగేందుకు సహకరించాలని వారు బొత్సకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రాష్ట్ర విభజనకు కేంద్రం, హైకమాండ్‌ నిర్ణయం తీసుకున్నందున సీమాంధ్ర ప్రాంత నేతలు రాజీనామాలు చేయకుండా చూడాలని సూచించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అడ్డుకొనేందుకు జరుగుతున్న ప్రయత్నాలు నిలువరించాలని కోరారు. ప్రజలను రెచ్చగొట్టే రీతిలో సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకులు వ్యవహరించడం సరికాదని, వారు హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉండేలా చూడాలని బొత్సను కోరారు.మరోవైపు, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దడంపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ఇటు తెలంగాణ ప్రాంత నేతలతో భేటీ అయిన సీఎం కిరణ్‌.. అటు సీమాంధ్ర ప్రాంత నేతలతోనూ సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన అంశంపై హైకమాండ్‌ తీసుకున్న నిర్ణయాలకు గల కారణాలను ఆయన వివరించారు. హైకమాండ్‌ నిర్నయానికి కట్టుబడి ఉండాలని కోరారు. సీమాంధ్రలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో సంయమనం పాటించాలని, ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించొద్దని ఆదేశించారు. సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులను సవిూక్షించి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన నేతలతో చర్చించారు.