కేసీఆర్‌ అన్నదాట్లో తప్పేముంది?


మీ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడే ఎలా తిష్టవేస్తారు?
సీమాంధ్ర అభివృద్ధిలో భాగం కండి
సీమాంధ్ర ఉద్యోగులకు హరీశ్‌ హితవు
హైదరాబాద్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) :
సీమాంధ్ర ఉద్యోగుల విషయంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నదాంట్లో తప్పేముందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. 30ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి పలు రాజ్యాంగపరమైన పదవులు అనుభవించిన కేసీఆర్‌ గత రాత్రి రాష్ట్రం విడిపోయాక ఆంధ్రా ఉద్యోగులు ఆంద్రా ప్రభుత్వానికి, ఆంధ్రాలో ఉన్న తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వానికి మారాల్సి ఉంటుందని న్యాయబద్దమైన ప్రకటన చేస్తే దాన్ని సీమాంధ్ర నేతలు, మీడియా చానళ్లు వక్రీకరించి చిలువలు పలువలు చేస్తున్నాయని ఆక్షేపించారు. తెలంగాణ భవన్‌లో ఆయన ఎమ్మెల్యేలు రాజయ్య, జోగు రామన్నలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడున్న ప్రభుత్వ ఉద్యోగులు ఆంధ్రా ప్రభుత్వానికి వెళ్లాల్సి ఉంటుందని, సీమాంధ్రలో ఉన్న తెలంగాణవాదులు తెలంగాణా ప్రభుత్వానికి రావాల్సి ఉంటుందని మాత్రమే చెప్పారన్నారు. హైదరాబాద్‌లో ఉన్న వారిని, పొట్టచేత పట్టుకుని వచ్చిన వారిని స్థిర నివాసం ఏర్పరుచుకున్న వారికి తాము వ్యతిరేకం కానే కాదని ఇప్పటికి లక్షసార్లు చెప్పాడన్నారు. ఆనాడు ఎందుకు ఇంత రాద్దాంతం చేసినట్లుగా ప్రచారం చేయలేదని నిలదీశారు. రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ చర్యల్లో బాగంగా జరిగే కార్యక్రమం ఏంచెపుతుందో గత రికార్డులు చూసుకోవాలని హరీష్‌రావు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ఆపివేయాలని, సీమాంధ్రులకున్న అనుమానాలను నివృత్తి చేస్తామని హరీష్‌రావు హామి ఇచ్చారు. దీనిపై చానళ్లు చర్చలు పెట్టాలని కోరారు. 12 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వస్తే కొన్ని చానళ్లు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. మీడియాలో ఉద్యమాలను చూపించొద్దని ఎన్‌బీఏ గైడ్‌లైన్స్‌, ప్రెస్‌కౌన్సిల్‌ గైడ్‌ లైన్స్‌ అంటూ తెలంగాణ ఉద్యమాన్ని నిషేధించినంత పనిచేశారన్నారు. ప్రస్తుతం సీమాంధ్రలో జరుగుతున్నదేంటో మీడియాకే తెలియాలని, ప్రభుత్వం దానిని ఎందుకు నియంత్రించడం లేదన్నారు. పన్నెండేళ్ల తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయాన్ని దాడి చేయలేదని, విగ్రహాలను ఎక్కడా కూడా విధ్వంసం చేయలేదని గుర్తుచేశారు. ఆనాడు మిలియన్‌ మార్చ్‌లో ముడు నాలుగు విగ్రహాలు ఆవేశంలో ధ్వంసం చేస్తే గొంతు చించుకున్న నన్నపనేని, లగడపాటి, సీమాంధ్ర నేతలకు నేడు జాతీయ నేతల విగ్రహాలు కూల్చుతుంటే కాల్చుతుంటే ఎందుకు కనిపించడం లేదని హరీశ్‌రావు నిలదీశారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరుగుతుంటే సిఎం, డిజిపి ఎందుకు మౌనపాత్ర వహిస్తున్నారని ప్రశ్నించారు. కేసిఆర్‌పై కొందరు నేతలు దానంలాంటి వారు విమర్శించడం దుర్మార్గమన్నారు. కేసిఆర్‌ అన్న మాటలను వక్రీకరిస్తుంటే విూరుకూడా అదేబాటలో పోతారా అని ప్రశ్నించారు. 12సంవత్సరాలు ఎంత సంయమనంతో ఉద్యమాన్ని నడిపాడో తెలిసి కూడా అపార్థంచేసుకుంటే ఎలాఅని ప్రశ్నించారు. సూర్యుడి మీద ఉమ్మేస్తే ఎం అవుతుందో కేసీఆర్‌ను విమర్శిస్తే కూడా అదే అవుతుందన్నారు. కేసీఆర్‌ను విమర్శించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న వారి విషయం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఇంకొకరేమో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని మంత్రులు డిమాండ్‌ చేయడం దౌర్బాగ్యమన్నారు. తెలంగాణలో ఉద్యమం ప్రశాంతంగా ప్రబుత్వ, ప్రైవేట్‌ ఆస్తులకు నష్టం కలుగకుండా జరిగితేనే నాడు ఉద్యమకారులను నక్సలైట్లని, జాతి ద్రోహులని, ఇంకేదో ఇంకేదో అంటూ అరిచి గీపెట్టిన సీమాంధ్ర నేతలు నేడు జరుగుతున్నదేంటో ఆలోచించుకోవాలన్నారు. చేతుల్లో గునపాలు, గడ్డపారలు పట్టుకుని కూల్చుతుంటే, కాలపెడుతుంటే ఏం అంటారో చెప్పాలని సమైక్య వాదులను డిమాండ్‌ చేశారు. ఆంధ్రాలో జరుగుతున్నది కేవలం సీమాంధ్ర ఉద్యమమేనన్నారు. రాష్ట్రంలోని 25 జిల్లాల్లో ఉద్యమం జరిగితేనే సమైక్యాంధ్ర ఉద్యమం అంటారని తెలుసుకోవాలన్నారు. నేడు సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలు కేవలం రాజకీయ క్రీడలో భాగంగా జరుగుతున్నవేనన్నారు. దీనిని ప్రజలు పట్టించుకోవద్దన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగితీరుతుందన్నారు. ఎవ్వరూ ఆపలేరన్నారు. ఎలా సాదించుకోవాలో కూడా తెలుసన్నారు. రాజకీయ పార్టీలు ద్వంద్వ నీతిని అవలంబిస్తున్నాయన్నారు. ఆనాడు 1999లో వైఎస్‌ సిఎల్‌పి లీడర్‌గా ఉన్నప్పుడే రాష్ట్రం విడగొట్టాలని 41మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసి సోనియాగాంధీకి పంపించినప్పుడు ఈ రఘువీరారెడ్డి తదితర సీమాంధ్ర నేతలు ఆనాడు ఏం చేశారని ప్రశ్నించారు. ఆనాడు ఎందుకు ఆపలేదని హరీశ్‌రావు సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలను ప్రశ్నించారు. సిఎల్‌పిలో హైకమాండ్‌ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి నేడు ఏం చేస్తున్నారో ఆలోచించుకోవాలని డిమాండ్‌ చేశారు. టిడిపి సైతం ఎర్రంనాయుడు ఆధ్వర్యంలో కమిటీ వేసి తెలంగాణాకు అనుకూలంగా తీర్మాణం చేసి కేంద్రానికి లేఖ రాసినప్పుడు టిడిపి సీమాంధ్ర నేతలు ఏం చేశారని ఆయన నిలదీశారు. ఓవైపు చంద్రబాబు కొత్త రాష్ట్రాన్ని స్వాగతిస్తుంటే మరోవైపు సీమాంధ్ర నేతలు రాజీనామాలు చేయడం, ఉద్యమాలు చేయడం ఏం నీతి అని ప్రశ్నించారు. తెలంగాణాలో జండా ఎత్తివేసిన వైఎస్సార్‌సిపి సీమాంధ్రలో ఉద్యమాలు పట్టి ప్రజలను తప్పుదారి పట్టిస్తుందన్నారు. ఇప్పటికైనా పార్టీలు నేతలను నియంత్రించి కొత్త రాష్ట్రాల ఏర్పాటుకోసం సహకరించాలని పిలుపునిచ్చారు.