తెలంగాణ యోధుడు ‘ఉప్పునూతల’ ఇకలేరు

హైదరాబాద్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) :
తెలంగాణ పోరాట యోధుడు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి కన్నుమూశారు. నల్గొండ జిల్లా మోత్కూర్‌ మండలం అడ్డగూడూరుకు చెందిన ఉప్పునూతల సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా పనిచేశారు. కాసు బ్రహ్మానంద రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, జలగం వెంగళరావు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. తొలుత చిన్ననీటి వనరులశాఖకు, మరోసారి ఆబ్కారిశాఖకు మంత్రిగా వ్యవహరించారు. ఆ రెండు సమయాల్లో కూడా ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆ తర్వాత రామన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా, ఏపీఐఐసీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి చైర్మన్‌గా కూడా ఆయన పనిచేశారు. కొంతకాలంగా ఆయన వైఎస్సార్‌సీపీలో కొనసాగుతున్నారు. గత ఏడాది మేలో బ్రెయిన్‌ స్టోక్ర్‌ రావడంతో  హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరి కోమాలోనే ఉన్నారు. శనివారం తెల్లవారు జామున ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. 80 ఏళ్ల వయస్సున్న ఉప్పునూతల వైఎస్‌ మరణం తర్వాత కాంగ్రెస్‌ను వదిలి వైఎస్సార్‌సీపీ వైపు అడుగులు వేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఆయన మృతిపట్ల పలువురు నేతలు ప్రగాడ సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేశారు. తెలంగాణా రాష్ట్ర సాధనకోసం ఆయన చేసిన పోరాటాలు మరిచిపోలేమని కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఇతరపార్టీల నేతలు కొనియాడుతున్నారు. అపార అనుభవం ఉన్న వ్యక్తి చివరికి తెలంగాణ వచ్చినంకనే చనిపోయినా ఆయనకు అనారోగ్యంతో కోమాలో ఉండడంతో అసలు విషయం తెలియకుండానే తుదిశ్వాస విడిచారు. 1960 నుంచి అయిదు దశాబ్దాలకాలం పాటు కాంగ్రెస్‌లో పనిచేశారు. వైఎస్సార్‌సిపి అధ్యక్షురాలు విజయమ్మ సంతాపం ప్రకటించారు. టిడిపి నేత ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఉప్పునూతల మృతదేహాని సందర్శించి పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. ఆయన మృతితో రాష్ట్రం మంచి నాయకున్ని కోల్పోయిందని పలువురు రాజకీయ నాయకులు పేర్కొన్నారు. ప్రజాసేవే పరమార్థంగా పనిచేసిన పురుషోత్తం సేవలను ప్రజలు ఏనాడూ మరిచిపోరని కొనియాడారు.