నేటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు


సభ ముందుకు 40 కీలక బిల్లులు
న్యూఢిల్లీ, ఆగస్టు 4 (జనంసాక్షి) :
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతాయి. అవసరమైతే మరికొంత గడువు పొడిగించే అవకాశం ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు. తాజా సమావేశాల్లో ఆహారభద్రత బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది. గత రెండు, మూడు పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగలేదని, రానున్న సమావేశాలు సజావుగా నడిచేందుకు సహకరించాలని, ఐదు నుంచి ఆరు ఆర్డినెన్సులు పార్లమెంటు ఎదుట ఉన్నాయని వాటి ఆమోదానికి కూడా సహకరించాలని ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులను ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కేంద్ర మంత్రి చిదంబరం శనివారంనాడు కోరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రతిపక్షాలు కొన్ని బిల్లులపై రిజర్వేషన్లను పాటిస్తున్నట్టు తెలుస్తోంది. ఎఫ్‌డీఐ నిబంధనల ఉపసంహరణ, ఉత్తరాఖండ్‌ ఘటన, రూపాయి పతనం, తదితర విషయాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. తెలంగాణ విభజనపై కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయం తరువాత చిన్న రాష్ట్రాల భవితవ్యంపై చర్చించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆహారభద్రత ఆర్డినెన్సులో కొన్ని సవరణలు చేయాలని సమాజ్‌వాది పార్టీ పట్టుపట్టే అవకాశం ఉందని సమాచారం. మొత్తమ్మీద ఈ సమావేశాల్లో 40 కీలక బిల్లులు ఉభయ సభల ముందుకు రానున్నాయి.