వ్యవ’సాయానికి’ ఆప్కాబే అగ్రగామి


సీఎం కిరణ్‌
హైదరాబాద్‌, ఆగస్టు 4 (జనంసాక్షి) :
వ్యవసాయ రుణాలు అంచడంలో ఆప్కాబ్‌ అగ్రగామిగా నిలిచిందని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కేంద్ర సహకార బ్యాంకు స్వర్ణోత్సవాలను ఆదివారం జూబ్లీహాల్‌లో ముఖ్యమంత్రి ప్రారంభించి ముఖ్య అతిథిగాపాల్గొన్నారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, కరీంనగర్‌ జిల్లా ముల్కనూరు ప్రాథమిక సహకార సంఘం రూ.200 కోట్ల వ్యాపారాన్ని సాధించిందని, రైతులకు సకాలంలో అందించడంవల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. దీనిని ఆదర్శంగా తీసుకుని ప్రతి జిల్లాలో ఒక్క సొసైటీ అయినా అమలుచేసి విజయం సాధించాలని ఆకాంక్షించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒకవైపు కూలీలకు వరంగా మారితే, మరోవైపు రైతుకు వ్యవసాయ కూలీల ఖర్చు పెరిగిందన్నారు. రైతు పెట్టుబడికి వెసులుబాడు కల్పించేందుకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌తో అనుసంధానం చేయాలని కేంద్రాన్ని, ప్రధానమంత్రిని పలుమార్లు కోరానన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం రాష్ట్రంలో  మూడేళ్ళలో రూ.2,500 కోట్లు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. దీనిలో కేంద్ర సహకార బ్యాంకు పెద్దఎత్తున పాల్గొనాలని సొసైటీలకు 30 నుంచి 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు అందించడం జరుగుతుందని స్పష్టంచేశారు. సభకు అధ్యక్షత వహించిన ఆప్కాబ్‌ చైర్మన్‌ పి.వీరారెడ్డి మాట్లాడుతూ, 50 ఏళ్ళల్లో బ్యాంకు సాధించిన ప్రగతిని వివరించారు. నాబార్డు చైర్మన్‌ డాక్టర్‌ ప్రకాశ్‌ బక్షీ మాట్లాడుతూ, సహకార రంగంలో రాష్ట్ర, ముఖ్యంగా ఆప్కాబ్‌ అనేక అంశాల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. బ్యాంకు ఎండి. గిరిధర్‌ మాట్లాడుతూ, బ్యాంకు 616 శాఖలపను కంప్యూటరైజ్డ్‌ చేసి రైతులు, ఇతర చేతివృత్తి వారికి, సహకార రంగంలోని వివిధ విభాగాలకు సేవలందిస్తున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు, వివిధ రాష్ట్రాల సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉత్తరాఖండ్‌ బాధితుల సహాయార్థం ఖమ్మం జిల్లా  కేంద్ర సహకార బ్యాంకు తరఫున రూ.5 లక్షల చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధికి బ్యాంకు అధ్యక్షులు అందజేశారు.