బాబు బామ్మర్ది హరికృష్ణ దొంగాట


విభజనకు వ్యతిరేకం కాదంటూ రాజీనామా
హైదరాబాద్‌, ఆగస్టు 4 (జనంసాక్షి) :
తెలంగాణపై టీడీపీ దొంగాట ఆడుతోంది. విభజనకు వ్యతిరేకం కాదంటూనే రాజ్యసభ సభ్యుడు, చంద్రబాబునాయుడు బావమరిది హరికృష్ణ తన పదవికి రాజీనామా సమర్పించారు. తద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మళ్లీ యూ టర్న్‌ సంధించారు. అయితే, విభజనకు సహకరిస్తామని పార్టీ అధినేతగా చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలను సైతం తుంగలోతొక్కి ఆయన నిర్ణయాన్ని ధిక్కరించి సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామా బాట పట్టినా వారిపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే కాకుండా కనీసం మందలించే ప్రయత్నం కూడా చేయలేదు. తన నివాసం నుంచే రాజీనామాలను ప్రోత్సహిస్తూ సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమానికి పూర్తిస్థాయి సహాయ సహకారాలను అందిస్తున్నారని విమర్శలున్నాయి. ఈ పరిస్థితుల్లోనే నందమూరి హరికృష్ణ రాజీనామా చేయడంతో బాబు వ్యవహార శైలిపై మళ్లీ ప్రజల్లో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. హరికృష్ణసైతం రాష్ట్ర విభజన జరిగిన తీరే అభ్యంతకరం అంటూ రాజీనామా లేఖను ప్రారంభించి చివరికి వచ్చే సరికి విభజన చేశారని, ప్రతి తెలుగువారి గుండె రగులుతుందని, హైదరాబాద్‌ ఎవరి అబ్బ సొత్తు కాదని, విభజనను వ్యతిరేకిస్తానని చెప్పారు. దీంతో చంద్రబాబు వ్యవహారశైలిపై ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. హరికృష్ణ ఆదివారం ఉదయం ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన తన రాజీనామా లేఖను ఉంచి రాజ్యసభ చైర్మన్‌కు పంపించారు. తెలుగు ప్రజలను రెండుగా చీల్చేందుకు ఇంతటి రాజకీయాలు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగిన తీరు బాగాలేదని ఒక్క చెబుతూనే మరోవైపు ఎలా చీలుస్తారని ఆయన కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. ఇందిరాగాంధీ తండ్రి నెహ్రూ ఇరు ప్రాంతాలకు పెళ్లి చేస్తే, ఆమె కోడలు సోనియా విడాకులు ఇస్తారా అని ప్రశ్నించారు. విభజన వల్ల ప్రతి తెలుగువారి గుండె రగిలిపోతుందన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఆధారంగా చేసుకొని రాష్ట్రాన్ని ఎలా విభజించారో స్పష్టం చేయాలని, శ్రీకృష్ణ రహస్య నివేదికను వెంటనే బయట పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు.విభజనకు ముందు ప్రజల అభిప్రాయాలను ఎందుకు తీసుకోలేదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. రాజధాని విషయం నీటి పంపకాలు, తదితర అంశాలను పరిష్కరించిన తర్వాతనే ప్రక్రియ ప్రారంభించాలని చెప్పారు. సమైక్యంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎవరు తీర్చాలో తేల్చి చెప్పాలన్నారు. తెలంగాణ నాయకులు కోరుతున్నట్లుగా హైదరాబాద్‌ తెలంగాణ ఎవరి అబ్బసొత్తుకాదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనను 13జిల్లాల ప్రజలు వ్యతిరేకిస్తుంటే అసలు రాష్ట్రాన్ని ఎందుకు విభజించారో కేంద్రం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. పాలన సౌలభ్యం రాష్ట్ర విభజన వల్ల ఎలా ఏర్పడుతుందో చెప్పాలన్నారు. సీమాంధ్ర ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడకుండా ధైర్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. మీ వెనుక మేం ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. కేవలం రాహుల్‌గాంధీని ప్రధాని చేసేందుకే తెలుగుజాతిని చీల్చరా ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యోగులకు తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని హరికృష్ణ హామీ ఇచ్చారు.