హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగం


వెనకడుగు వేసే ప్రసక్తిలేదు
పదేళ్లు మాత్రమే ఉమ్మడి రాజధాని
సీఎన్‌ఎన్‌ ఐబీఎన్‌ ఇంటర్వ్యూలో దిగ్విజయ్‌
హైదరాబాద్‌, ఆగస్టు 4 (జనంసాక్షి) :
హైదరాబాద్‌ ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భాగమేనని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. తెలంగాణపై ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేసే ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఢిల్లీలో  సీఎన్‌ఎన్‌ ఐబీఎన్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హైదరాబాద్‌పై పూర్తి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో హైదరాబాద్‌ అంతర్భాగమేనని స్పష్టం చేశారు. అలాగే కేంద్రపాలిత ప్రాంతం అయ్యే అవకాశం కూడా లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. పదేళ్ల వరకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఆ తర్వాత తెలంగాణలో అంతర్భాగం అవుతుందని చెప్పారు. ఆ క్రమంలో సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు అవుతుందని తెలిపారు. గతంలో చండీగఢ్‌ నగరాన్ని పంజాబ్‌కు ఇస్తామని వాగ్దానం చేశారు. కానీ చివరకు హర్యానా, పంజాబ్‌కు ఉమ్మడి రాజధాని అయిందని గుర్తుచేశారు. కానీ అలాంటి సంఘటన ఇప్పుడు పునరావృతం కాదని చెప్పారు.