మెజార్టీ అభిప్రాయంతోనే రాష్ట్ర విభజన


హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) :
రాష్ట్రంలోని మెజార్టీ అభిప్రాయం మేరకే కాంగ్రెస్‌ పార్టీ విభజన నిర్ణయం తీసుకుందని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విభజన విషయంలో కాంగ్రెస్‌ను దోషిగా చూపాలని ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, వైఎస్సార్‌సీపీ కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను కూల్చితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఎన్టీఆర్‌, వైఎస్‌ విగ్రహాలను కూల్చితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. సోమవారం బొత్స మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన విషయంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీని దోషిగా చూపే యత్నాలు చేస్తున్నాయని తెలిపారు. జిల్లాల్లో ఇందిరాగాంధీ, రాజీవ్‌ విగ్రహాలను ధ్వంసం చేయడం అమానుషమన్నారు. ఇకపై కాంగ్రెస్‌ను దోషిగా చూపాలని యత్నించినా, విగ్రహాలను విధ్వంసం చేసినా చూస్తూ ఊరుకోబోమన్నారు. ఆయా ప్రయత్నాలను కాంగ్రెస్‌ నేతలంతా వెంటనే ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు హాని చేకూర్చే వారి నుంచి పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. స్థానికంగా మంచి పేరున్న అభ్యర్థికే పార్టీలో ప్రతానిథ్యం కల్పిస్తామని చెప్పారు. పార్టీని బలోపేతం చేసేందుకు అందరు కష్టపడాలని సూచించారు. జిల్లా అధ్యక్షులు పార్టీకి గౌరవం తెచ్చేలా వ్యవహరించాలని హితవు పలికారు. మహిళా కాంగ్రెస్‌ నేతలకు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు.తామని ఆయన చెప్పారు. రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదని ఆయన పేర్కొన్నారు.