తెలంగాణ సుదీర్ఘపోరాటం

నిర్ణయం చారిత్రాత్మకం
పున: పరిశీలనకు అవకాశమే లేదు
తేల్చిచెప్పిన జానారెడ్డి
హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం చరిత్రాత్మక నిర్ణయమని మంత్రి జానారెడ్డి పేర్కొన్నారు. సుదీర్ఘ పోరాటం వల్ల కేంద్రం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. తెలంగాణపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ తీసుకున్న నిర్ణయం పునఃపరిశీలన అసాధ్యమని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి తెలుగు జాతి భవిష్యత్తు కోసమే అధిష్టానం విభజన నిర్ణయం తీసుకుందన్నారు. తమది అరవై ఏళ్ల పోరాటమని గుర్తు చేశారు. తెలుగు జాతి ఐక్యత దెబ్బ తినకుండా ఉండేందుకు సీమాంధ్ర ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. సీమాంధ్రలో జరుగుతున్న పరిణామాలు ఎవరికీ మేలు చేసేవి కావని, వెంటనే ఆందోళనలు విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరికీ నష్టం వాటిల్లకుండా రెండు రాష్ట్రాలుగా  విడిపోయి అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘మీట్‌ ది ప్రెస్‌’లో జానారెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు వివరంగా సమాధానాలిచ్చారు. తెలంగాణ నిర్ణయం చారిత్రాత్మకమని, దీనిపై అధిష్టానం పునరాలోచన చేసే అవకాశం లేదని తేల్చిచెప్పారు. ఎవరికీ నష్టం వాటిల్లకుండా రెండు రాష్టాల్రు ఏర్పాటు చేసుకుందామన్నారు. నదీజలాలు, ఉద్యోగాలు, వనరుల విషయంలో సమస్యల పరిష్కారానికి కమిటీ వేయాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం పార్టీ, పదవులకు రాజీనామాలే కాదు.. రాజకీయాలను వదిలేందుకు సిద్ధమని వెల్లడించారు.

ఆవేశంతోనే ఆందోళనలు

సీమాంధ్ర సోదరులు ఆవేశంతో ఆందోళన చేస్తున్నారని జానా అన్నారు. హైదరాబాద్‌తో వారికున్న అనుబంధం, వారి మనోభావాలు అర్థం చేసుకోవద్దవేనన్నారు. సీమాంధ్ర ప్రజల బాధను అర్థం చేసుకుంటున్నామని, కానీ సంయమనం పాటించాలని కోరారు. విధ్వంసాలకు పాల్పడకుండా ఉండాలని సీమాంధ్ర ప్రాంత ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. అందరూ అపోహలు వదిలేసి రాష్ట్ర విభజనకు సహకరించాలని, విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉందామన్నారు. చారిత్రక నిర్ణయం జరిగిన తర్వాత దాన్ని నేతలంతా చెప్పకపోతే సమాజానికి ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. డిసెంబర్‌ 9 తర్వాత తెలంగాణపై కేంద్రం వెనక్కి తగ్గినప్పటికీ, మూడేళ్లు ఓపిక పట్టామని గుర్తు చేసిన జానారెడ్డి.. సీమాంధ్ర ప్రాంత ప్రజలు కూడా సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.
60 ఏళ్ల ఉద్యమ ఫలితం తెలంగాణ..
తెలంగాణ ఆకాంక్ష ఇప్పటిది కాదని, 60 ఏళ్ల క్రితం నాటిదేనని జానా గుర్తు చేశారు. తెలంగాణ నిర్ణయం కానీ రాత్రికి రాత్రి జరిగింది కాదనీ జానా పేర్కొన్నారు. మూడేళ్లుగా సంప్రదింపులు జరిపినా అనంతరమే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర కోసం అరవై ఏళ్లుగా ఉద్యమం కొనసాగుతోందని, తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్టులు, మేధావుల పాత్ర ఎంతో ఉందన్నారు. వారు చాలా పోరాటాలు చేశారని ప్రశంసించారు. ఉద్యమంలో బలిదానాలు చేసుకున్న వారికి ఆయన జోహర్లు తెలిపారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఏకైక ఉద్యమం తెలంగాణ ఉద్యమేనన్నారు.
తెలుగు జాతి భవిష్యత్‌ కోసమే..
తెలుగు ప్రజల అభివృద్ధిని కాంక్షించే తెలంగాణపై నిర్ణయం జరిగిందని తెలిపారు. ఏదో ఒకపక్క ఎప్పుడో ఒకప్పుడు ఆవేశానికి గురైనా తెలుగు జాతి భవిష్యత్తు బాగుండాలనే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తెలంగాణపై ప్రకటన చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ 23న మరోసారి నిర్ణయం పునఃపరిశీలనకు నిర్ణయించినా.. అప్పట్లో తాము ఆవేశానికి లోనుకాలేదన్నారు. ఎక్కడో ఒకచోట తప్ప పెద్దగా సమస్యలు రాలేదన్నారు. అలాగే ఇప్పుడు మళ్లీ నిర్ణయం మారితే ఇక్కడ కూడా పరిణామాలు తీవ్రంగా ఉండే ప్రమాదముందుని, అది మానవాళికే మంచిది కాదని జానా హెచ్చరించారు. అన్నదమ్ములుగా కలిసి ఉందామని, ఏ విషయంలో నష్టం జరగని విధంగా రెండు రాష్టాల్రు ఏర్పాటు చేసుకుందామన్నారు. పరస్పర అవగాహనతో, ఎవరికీ నష్టం లేకుండా సమస్య పరిష్కరించడంలో కృషి చేయవచ్చన్నారు. ఎందులో నష్టం వస్తుందని అనుకున్నా.. హైపవర్‌ కమిటీ ద్వారా, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు.
పాలనా సౌలభ్యం కోసమే..
పరిపాలనా సౌలభ్యం కోసమే రాష్ట్ర విభజన అని జానా పేర్కొన్నారు. రెండు రాష్టాల్రు దేశానికి ఆదర్శంగా ఉండేలా కృషి చేద్దామని సూచించారు. హైదరాబాద్‌ సహా తెలంగాణ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరూ తెలంగాణవాదులుగానే గుర్తించాలన్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్రులకు పూర్తి భద్రత ఉంటుందని, వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇక్కడి సీమాంధ్రులకు తాము అండగా ఉంటామని హావిూ ఇచ్చారు. సామరస్య వాతావరణం నెలకొల్పేలా పార్టీలన్నీ ముందుకు రావాలని జానారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల కోసం అవసరమైతే పార్టీయే కాదు రాజకీయాలను వీడేందుకు తాను సిద్దమని వెల్లడించారు. రాష్ట్ర విభజనకు సహకరించిన టీడీపీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఆయన పేర్కొన్నారు.