పూంచ్‌లో మళ్లీ తెగపడ్డ పాక్‌


– ‘హద్దు’దాటి కాల్పులు    – ఐదుగురు జవాన్ల మృతి
– పాక్‌ది పిరిగిపంద చర్య ధీటుగా సమాధానం చెప్తాం
– పార్లమెంట్‌లో ఆంటోని
శ్రీనగర్‌, ఆగస్టు 6 (జనంసాక్షి) :
పాకిస్తాన్‌ మరోమారు ‘హద్దు’ దాటింది. కొంతకాలంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న దాయాది దేశం తాజాగా మళ్లీ భారత సైన్యంపై కాల్పులకు తెగబడింది. కాల్పుల నియంత్రణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, ఐదుగురు జవాన్లను కాల్చి చంపింది. సోమవారం అర్ధరాత్రి జమ్మూకాశ్మీర్‌ పూంచ్‌ సెక్టార్‌లోని చకందాబాద్‌ వద్ద భారత బలగాలపై పాక్‌ సైనికులు కాల్పులు జరిపారు. నియంత్రణ రేఖ సమీపంలో జరిగిన ఈ దాడిలో ఐదుగురు భారత జవాన్లు మృతి చెందారు. అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్‌ సైనికులు భారత భూభాగంలోకి చొరబడి, సార్లా పోస్టుపై మెరుపుదాడి చేసినట్లు రక్షణ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఈ దాడిలో ఐదుగురు సైనికులు మృతి చెందారు. ఈ దాడిని జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ధ్రువీకరించారు. ‘ఈ సమాచారం (పాక్‌ దాడి) గురించి నాకు ఉదయం తెలిసింది. నియంత్రణ రేఖ వద్ద జరిగిన దాడిలో ఐదుగురు సైనికులు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’ అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ విధమైన చర్యలు పాకిస్తాన్‌ సంబంధాలను సాధారణస్థితికి తేవడానికి గానీ, మెరుగుపరచడానికి గానీ ఉపకరించవని ఆయన పేర్కొన్నారు. కాగా, తాజా పరిస్థితిపై సైన్యం, రక్షణ శాఖ దిగ్భాంతి వ్యక్తం చేశాయి. పాక్‌ దాడిని తీవ్రంగా ఖండించాయి. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ విక్రమ్‌సింగ్‌ పరిస్థిని సవిూక్షిస్తున్నారు. దాయాది దేశం దాడిని సమర్థంగా తిప్పికొట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తాజా ఘటన ప్రభావం ఈ నెలాఖరులో జరగనున్న ఇరు దేశాల ప్రధానుల సమావేశంపై ప్రభావం పడనుందని భావిస్తున్నారు. ఈ నెలాఖరులో న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా భారత్‌, పాక్‌ ప్రధానులు మన్మోహన్‌సింగ్‌, నవాజ్‌ షరీఫ్‌ సమావేశమవుతారని అధికార వర్గాలు భావిస్తూ వచ్చాయి. అయితే, తాజా దాడి నేపథ్యంలో ఈ సమావేశం జరగకపోవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, పూంచ్‌ ఘటన జరిగిన గంటల్లోపే పాక్‌ సైన్యం, నారాయణ్‌పూర్‌ సరిహద్దు ఔట్‌పోస్టపైనా దాడి చేసింది. పూంచ్‌ సెక్టార్‌లో ఐదుగురిని కాల్చిచంపిన పాక్‌ సైనికులు.. అంతర్జాతీయ సరిహద్దు సవిూపంలో ఉన్న నారాయణ్‌పూర్‌ సరిహద్దు ఔట్‌పోస్టపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హెడ్‌ కానిస్టేబుల్‌ రామ్‌నివాస్‌ విూనా తీవ్రంగా గాయపడ్డారని సైన్యం తెలిపింది. పాక్‌ ఇటీవల కాలంలో తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. జూలై 1న పేలుడు పదార్థాలతో భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నిస్తున్న వారిని అడ్డుకొనేందుకు యత్నించిన సైన్యంపై పాక్‌ జవాన్లు కాల్పులు జరిపారు. జూలై 3న మరోమారు భారత భూభాగంలోకి కాల్పులు జరిపింది. పూంచ్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ సవిూపంలో పాక్‌ బలగాలు మోర్టార్లు, మెషిన్‌ గన్లతో కాల్పులకు తెగబడ్డారు. అదే నెల 8న మరోమారు భారత జవాన్లపై దాడికి పాల్పడ్డారు. 12వ తేదీన జమ్మూ జిల్లాలోని పిండి బెల్ట్‌పై పాకిస్తానీ రేంజర్లు కాల్పులు జరిపారు. జూలై 27న పూంచ్‌, కత్వా జిల్లా సరిహద్దుల్లో రెండుసార్లు దాడులకు పాల్పడింది. ఈ దాడిలో ఓ జవాను తీవ్రంగా గాయపడ్డారు.పాక్‌ సైన్యం భారత భూభాగంలోకి చొరబడి సైనికులను కాల్చి చంపడాన్ని పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. దాయాది దేశం కవ్విస్తున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఒప్పందాలను ఉల్లంఘిస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్న పొరుగు దేశానికి తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్‌ చేశారు. పూంచ్‌ సెక్టార్‌లో ఐదుగురు భారత జవాన్లను కాల్చి చంపడాన్ని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. పాక్‌ దురాగతాన్ని ‘దుర్మార్గపు చర్య’గా అభివర్ణించారు. భారత సైనికులపై దాడి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. చైనా చొరబాట్లు, పాక్‌ దుశ్చర్యల నుంచి సరిహద్దులను రక్షించడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. యూపీఏ పాలకులు మేలుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ‘సరిహద్దుల్లోకి చైనా చొరబడుతోంది. పాక్‌ దుశ్చర్యలకు పాల్పడుతోంది. వాటిని తిప్పికొట్టడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైంది. కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎప్పుడు మేల్కొంటుంది?’ అని ఆయన ట్విట్టర్‌లో ప్రశ్నించారు.  దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు ఆయన సంతాపం ప్రకటించారు. పాక్‌ దూకుడు చర్యలపై సమాజ్‌వాదీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. పొరుగు దేశాలు తరచూ దండెత్తుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆ పార్టీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌ ప్రశ్నించారు. ఓవైపు చైనా, మరోవైపు పాక్‌ భారత్‌లోకి చొరబడేందుకు యత్నిస్తున్నాయని, వారిని నియంత్రిందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందని నిలదీశారు. పాక్‌, చైనాలు రహస్య ఒప్పందాలతో భారత భూభాగంలో చొరబడేందుకు యత్నిస్తున్నాయన్నారు. ఇదిలా ఉంటే, తాము ఎలాంటి కాల్పులు జరపలేదని పాకిస్తాన్‌ పాత పాటే పాడింది. తమ దళాలు అసలు నియంత్రణ రేఖను దాటనే లేదని, భారత సైనికులను హతమార్చలేదని ప్రకటించింది. అసలు నియంత్రణ రేఖ వద్ద అలాంటి సంఘటన ఏదీ జరగనే లేదని, తమ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాని ఉల్లంఘించలేదని పాక్‌ సైనికాధాకరి ఒకరు చెప్పారు.
పాకిస్తాన్‌ దాడి పార్లమెంట్‌లో ప్రకంపనలు సృష్టించింది. ఐదుగురు భారత జవాన్లను కాల్పిచంపిన ఘటన లోక్‌సభ, రాజ్యసభలను కుదిపేసింది. పాక్‌ సైన్యం భారత భూభాగంలో చొరబడి ఐదుగురు జవాన్లను కాల్చి చంపిన ఘటనపై అట్టుడికింది. పొరుగు దేశం మన భూభాగంలో చొచ్చుకువస్తున్నా, కాల్పులతో కవ్విస్తున్నా చేష్టలూడిగి చూస్తున్న ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఉభయ సభల్లో విపక్ష సభ్యులు పట్టుబట్టారు. సభా కార్యకలాపాలను స్తంభింపజేశారు. మంగళవారం ఉదయం ఉభయ సభలు ప్రారంభం కాగానే బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. కాల్పుల ఘటనపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రకటన చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. కేంద్ర రక్షణ మంత్రి ప్రకటన చేస్తారని కేంద్రం స్పష్టం చేసిన విపక్షాలు పట్ట వీడకపోవడంతో సభలలో గందరగోళం నెలకొంది. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. లోక్‌సభ మంగళవారం ఉదయం సమావేశం ప్రారంభం కాగానే పాక్‌ కాల్పుల ఘటన, ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశంపై సభ్యులు ఆందోళనకు దిగారు. జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో పాక్‌ సైన్యం కాల్పులు జరిగిన ఘటనలో ఐదుగురు భారత జవాన్లు మృతి చెందిన ఘటనపై సమాధానం చెప్పాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి. బీజేపీ, సమాజ్‌వాదీ సభ్యులు స్పీకర్‌ వెళ్లి ఆందోళనకు దిగారు. మరోవైపు, తమ ప్రాంతానికి న్యాయం చేయాలని సీమాంధ్ర ఎంపీలు సభను అడ్డుకున్నారు. వారికి ప్రతిగా తెలంగాణ ప్రాంత ఎంపీలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. దీంతో సభ గంట పాటు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన అనంతరం పాక్‌ సైన్యం చేతిలో అసువులు బాసిన జవాన్లకు లోక్‌సభ నివాళులు అర్పించింది. అనంతరం సీమాంద్ర ఎంపీలు ఆందోళన కొనసాగించారు. స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. అయితే, వారికి ప్రతిగా తెలంగాణ ప్రాంత ఎంపీలు తమ స్థానాల్లోంచి లేచి తెలంగాణ నినాదాలు చేశారు. కాగా, పాక్‌ కాల్పుల ఉదంతంపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. చైనా, పాకిస్తాన్‌ నుంచి భారత్కు ముప్పు పొంచి ఉందని సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. పూంచ్‌ సెక్టార్‌లో పాక్‌ జరిపిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులయ్యారని తెలిపారు. పాక్‌ నుంచి నిరంతరం చొరబాట్లు జరుగుతున్నాయని, సమష్టిగా ఎదుర్కొవాల్సిన అవసరం ఉందన్నారు. పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. పాక్‌ కాల్పులపై ప్రధాన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. భారత్‌పై చైనా మరోసారి దాడి చేసే ప్రమాదముందని హెచ్చరించారు. అటు సీమాంధ్ర సభ్యుల ఆందోళనలు కొనసాగడంతో స్పీకర్‌ వారికి నచ్చజెప్పారు. ఈ అంశంపై తర్వాత చర్చిద్దామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించి, తమ స్థానాల్లో కూర్చున్నారు. సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. పాక్‌ దాడి, రాష్ట్ర విభజన అంశాలు రాజ్యసభను కూడా కుదిపేశాయి. రాష్ట్ర విభజనను ఆపాలని, తమ ప్రాంతానికి న్యాయం చేయాలంటూ సీమాంధ్ర ఎంపీలు ఆందోళనకు దిగారు. పాక్‌ కవ్వింపు చర్యలపై ప్రభుత్వం ఏం చేస్తోందని బీజేపీ సభ్యులు నిలదీశారు. పాక్‌ దుశ్చర్యపై సమాధానం చెప్పాలని రవిశంకర్‌ ప్రసాద్‌, వెంకయ్యనాయుడు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని కోరారు. అయితే, దీనిపై మధ్యాహ్నం చర్చిద్దామని డెప్యూటీ చైర్మన్‌ సూచించినా బీజేపీ నేతలు వినలేదు. ఒక పక్క దేశ భద్రత ప్రమాదంలో పడినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తక్షణమే ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. అదే సమయంలో సీమాంధ్ర ఎంపీలు ఆందోలనకు దిగడంతో బీజేపీ నేత వెంకయ్యనాయుడు రాష్ట్ర విభజన అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. అస్పష్ట ప్రకటనతో కాంగ్రెస్‌ సమస్యను మరింత జఠిలం చేసిందని విమర్శించారు. సభ్యుల ఆందోళనలతో గందరగోళం నెలకొనడంతో సభ వాయిదా పడింది. రాజ్యసభలో విపక్ష నేత అరుణ్‌జైట్లీ ప్రశ్నకు రక్షణ మంత్రి ఏకే ఆంటోని సమాధానమిస్తూ శత్రువుకు ధీటైన జవాబునిస్తామన్నారు. పాకిస్తాన్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరిపిస్తూ తమకేమి తెలియదని బుకాయిస్తోందని చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి 57 సార్లు కాల్పులకు తెగపడిందని చెప్పారు. ఈ సందర్భంగా పాక్‌ సైన్యం దుశ్చర్యను ఆయన ఖండించారు.