అందరినీ సంప్రదించాకే తెలంగాణ


నాలుగైదు నెలల్లో ప్రత్యేక రాష్ట్రం మీట్‌ ది ప్రెస్‌లో డీఎస్‌
హైదరాబాద్‌, ఆగస్టు 6 (జనంసాక్షి)
అన్ని పార్టీలతో విస్తృతంగా సంప్ర దింపులు జరిపిన తర్వాతనే  కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకుం దని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీని వాస్‌ అన్నారు. మరో నాలుగైదు నెలల్లో తెలంగాణ ప్రక్రియ పూర్తవు తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ ‘ప్రత్యేక’ వరం ప్రసాదించారని తెలిపారు. మంగళవారం హైదరా బాద్‌లో తెలంగాణ జర్నలిస్టు ఫోరం నిర్వహించిన మీట్‌ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్‌ మాట్లాడుతూ,  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నందుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన మేధావులు, జర్నలిస్టులు, కళాకారులు, విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ కోసం కెేంద్ర క్యాబినెట్‌లో నోట్‌ తయారు చేయనున్నట్లు కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అనివార్యమైందని చెప్పారు. ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా తాను తెలంగాణ అంశంపైనే  సోనియాతో చర్చించేవాడినని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ తీవ్రతను, తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్‌ పార్టీ గుర్తించిందని తెలిపారు. 1956లోనే అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తెలంగాణ ప్రజలు ఆంధ్రాతో కలిసి ఉండడం ఇష్టంలేకపోతే విడిపోవచ్చని ఆనాడే చెప్పారని తెలిపారు. సోనియాగాంధీ తెలంగాణపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు. దేశంలోని ప్రతిమూలలో జరిగే అంశంపై ఆమెకు పూర్తి అవగాహన ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన పాత్ర పోషించిందని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన, తెచ్చిన ఘనత తమ పార్టీకే దక్కిందన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఎనలేని కృషి చేశారని, ఆయన ఆకాంక్షను కాంగ్రెస్‌ పార్టీ నెరవేర్చిందని తెలిపారు. గాంధీ కుటుంబం దేశ ప్రజలను తమ కుటుంబంగా భావిస్తుందన్నారు. రాష్ట్ర విభజనపై ఎలాంటి సీమాంధ్ర ప్రజలు ఎలాంటి ఆందోళనలు, అపోహలు పాల్పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రాంతాలుగా విడిపోయి రెండు ప్రాంతాలను అభివృద్ది చేసుకుందన్నారు. ఇక్కడ వారందరిని తెలంగాణ రాష్ట్రానికే చెందిన వారిగా భావిస్తామని డీఎస్‌ హామీ ఇచ్చారు. 56 ఏళ్ల నుంచి తెలంగాణ కోసం అక్కడి ప్రజలు కలలు కంటున్నారని, వారి కలలను వమ్ము చేసే విధంగా కలిసి ఉందామని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవద్దని సూచించారు. తెలంగాణలో కంటే ఆంధ్రాలోనే వనరులు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. జాతీయ నేతల విగ్రహాలను కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దేశం కోసం నెహ్రూ, ఇందిర, రాజీవ్‌గాంధీ సేవలను ఆయన కొనియాడారు. అలాంటి జాతీయ నేతలను అవమాన పరిచే విధంగా ఎవరూ వ్యవహరించకూడదని కోరారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ విలీనం కావడం కేసీఆర్‌ ఇష్టానుసారంబట్టి ఉంటుందని చెప్పారు. విలీనం కంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షను మాత్రం కాంగ్రెస్‌ నెరవేర్చిందన్న తృప్తి ఉందని డీఎస్‌ అన్నారు.