గేట్లెత్తిన సాగర్‌


– సందర్శకుల తాకిడి
నల్గొండ, ఆగస్ట్‌ 7 (జనంసాక్షి) :
ఎగువ ప్రాంతాల్లో వచ్చి చేరుతున్న వరదలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. సాగర్‌ జలాశయం నిండుకుండలా తొణికిసలాడుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ ప్రస్తుత నీటిమట్టం 585 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 1.93లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో 6 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి 50వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  కుడి, ఎడమ కాల్వల పరిధిలోని రెండు, మూడో జోన్లకు కూడా నీటి విడుదల చేయడానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో రైతన్నలు ఆనందంగా ఉన్నారు. మరోవైపు సాగర్‌ అందాలు చూడడానికి చుట్టుపక్కల ప్రజలు తరలి వస్తున్నారు. రెండు మూడు రోజుల్లో సందర్శకులు పెరిగే అవకాశం ఉంది. దీంతో సాగర్‌కు పర్యాటక కళ వచ్చింది. శ్రీశైలానికి భారీగా ఇన్‌ఫ్లో రావడంతో దిగువనే ఉన్న సాగర్‌కు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్‌కు కూడా భారీగానే వరద వచ్చి చేరుతోంది. 2006 తర్వాత  సాగర్‌లోకి నీరొచ్చి చేరడం ఇదే మొద టిసారి. 2009 అక్టోబరులో సాగర్‌ చరిత్రలో రికార్డుస్థాయిలో వరదలొచ్చినా ఆగస్టు మొదటి వారం లోనే సాగర్‌ జలాశయంలో గరిష్ట నీటిమట్టానికి చేరడం మాత్రం ఇదే ప్రథమం. సాగర్‌ జలాశయంలో ముందస్తుగా నీరొచ్చి చేరడంతో గతం కంటే ముందుగానే నీటి విడుదల చేశారు. గత పదేళ్లుగా పరిశీలించినా ఆగస్టు 2వ తేదీ నాటికి నీటి విడుదల చేయడం కూడా ఇదే తొలిసారి. ఎగువ ప్రాంతాల్లో వచ్చి చేరే వరద నీటిని దృష్టిలో పెట్టుకుని కుడి, ఎడమ కాల్వల పరిధిలో కేవలం మొదటి జోన్‌కు మాత్రమే నీటి విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ నీటి విడుదల చేసినా .. ఇప్పటికీ వరద ఉధృతి తగ్గకపోవడం వల్ల రెండు, మూడు జోన్లకు కూడా నీటి విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. సాగర్‌ జలాశయంలోకి భారీగా వరద నీరొచ్చి చేరడంతో బుధవారం ఉదయమే క్టస్ర్‌గేట్లను ఎత్తారు. మొదట 6 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల చేసి క్రమంగా గేట్ల సంఖ్య పెంచనున్నారు. సాగర్‌ దిగువ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతవాసులు వరదలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని  తెలిపారు.