అధికారికంగా ఆంటోని కమిటీ


సీమాంధ్రులు కష్టనష్టాలు చెప్పుకోండి
ఆందోళనలు విరమించండి
రాష్ట్రాల విభజన కష్టమే..
తెలంగాణ నిర్ణయం అయిపోయింది : దిగ్విజయ్‌
న్యూఢిల్లీ, ఆగస్టు 7 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో సీమాంధ్రుల అభ్యంతరాలు చెప్పుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఏకే ఆంటోనీ నేతృత్వంలో అధికారికంగా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌  దిగ్విజయ్‌సింగ్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఓ కుటుంబం లాంటి ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించడం చాలా కష్టమైన పని అని ఆయన పేర్కొన్నారు. అయితే అన్ని  నిర్ణయాలు తీసుకున్నామని, విభజనకు నిర్ణయం జరిగిపోయిందన్నారు. కాంగ్రెస్‌ అన్ని సమస్యలకు పరిస్కారం చూపుతుందని ఆయన తన బెంగుళూరు పర్యటనలో అన్నారు. తెలంగాణ సమస్య చాలా ఏళ్లుగా నలుగుతోందని, ఆందోళనలు కొనసాగు తున్నాయని ఆయన అన్నారు. ఆంటోనీ కమిటీ నేటి నుంచి పని ప్రారంభిస్తుందని దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. ఈ కమిటీకి అందరూ తమ సమస్యలు విన్నవించవచ్చాన్నారు. ఎన్జీవోలు, విద్యార్థులు, అన్ని పక్షాల రాజకీయ నాయకులు కమిటీ ముందు అభిప్రాయాలు చెప్పొచ్చని, అందరికీ సంతృప్తికరమైన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఏపీఎన్జీవోలు సమ్మెకు వెళ్లవద్దని ఆయన కోరారు. ఏపీ ఎన్జీవోలు తమ అభిప్రాయాలను ఆంటోనీ నేతృత్వంలోని కమిటీకి చెప్పొచ్చని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతం వారికి అన్యాయం జరగకుండా చూస్తామని దిగ్విజయ్‌ సింగ్‌ బుధవారం చెప్పారు.  రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని కోరారు. అన్ని సంఘాలు ధర్నాలను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ సమస్య ఎప్పటి నుండో ఉందని, అందుకే సిడబ్ల్యూసి తీర్మానం చేసిందన్నారు. మరోవైపు ఆంధప్రదేశ్‌ విభజనపై నలుగురు సభ్యులతో కూడిన హైలెవల్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెసు పార్టీ బుధవారం ప్రకటించింది. ఈ కమిటీలో ఎకె ఆంటనీ, దిగ్విజయ్‌ సింగ్‌, వీరప్ప మొయిలీ, అహ్మద్‌ పటేల్‌లు ఉన్నారు. ఆంటోనీ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటయింది. వీరు సీమాంధ్రుల అభిప్రాయాలను సేకరించనున్నారు. సిడబ్ల్యూసి తీర్మానం అనంతరం జరిగిన పరిణామాలపై సమాచారం సేకరించనున్నారు. ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు సీనియర్‌ నేత జనార్ధన్‌ ద్వివేది  ప్రకటించారు. అయితే తెలంగాణ ఏర్పాటుపై అభ్యంతరాలను వినడానికి మాత్రమే ఈ కమిటీ ఏర్పాటయినట్లుగా తెలుస్తోంది. సీమాంధ్రులు తమ అభిప్రాయాలను చెప్పనున్నారు. ఈ కమిటీ- కాలపరిమితిని చెప్పలేదు. అయితే సాధ్యమైనంత త్వరగా దీనిని పూర్తి చేయాలని కమిటీకి సూచించినట్లుగా సమాచారం. మరోవైపు సీమాంధ్ర నేతలు చెబుతున్నట్లుగా కమిటీ నిర్ణయం వచ్చేదాగా తెలంగాణ పక్రియ ఆగుతుందని పేర్కొనలేదు.  అయితే విభజన ప్రక్రియ ఆగలేదని పిసిసి అధికార ప్రతినిధి పిసి చాకో అన్నారు. ఆంటోనీ కమిటీ దీనికి కొనసాగింపేనన్నారు. కమిటీలో వివిధ అంశాలు చర్చించవచ్చన్నారు. ఇదిలావుంటే  ఎపిలోఎన్నికల మేనిఫెస్టో అమలు కమిటీని కూడా ఆంగ్రెస్‌  నియమించింది. ఇందులో ఎకె ఆంటోనీ, వి నారాయణ స్వామి, దిగ్విజయ్‌ సింగ్‌, కిరణ్‌ కుమార్‌ రెడ్డి, బొత్స సత్యనారాయణ, గీతా రెడ్డి, ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, తిరువనక్కరసు, ఇన్‌చార్జులుగా ఉన్న ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారు.