జవాన్లపై దాడి వెనుక పాక్‌ హస్తం


ఆంటోని దిద్దుబాటు ప్రకటన
న్యూఢిల్లీ, ఆగస్టు 8 (జనంసాక్షి) :
భారత జవాన్ల ఊచకోతపై కేంద్ర ప్రభుత్వం మాట మార్చింది. ఐదుగురు జవాన్లను హతమార్చిన ఘటనలో పాక్‌ హస్తం లేదని, ఉగ్రవాదులే కాల్చిచంపారని పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటించిన ప్రభుత్వం… విపక్షాల ఆందోళనల నేపథ్యంలో గురువారం తాజాగా ప్రకటన చేసింది. భారతీయ జవాన్లపై దాడికి పాకిస్తాన్‌దే పూర్తి బాధ్యత అని రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో మరో ప్రకటన చేశారు. పాక్‌ సాయం లేనిదే సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఇటువంటి ఘటనలు జరగవని తెలిపారు. జవాన్లపై దాడి ఘటనలో పాకిస్తాన్‌ సైన్యానికి చెందిన ప్రత్యేక బలగాలు పాల్గొన్నాయని వెల్లడించారు. పొరుగు దేశం సాయం లేనిదే భారత బలగాలపై దాడులు జరగవని తేల్చిచెప్పారు.భారత్‌, పాక్‌ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద పాక్‌ బలగాలు రెండ్రోజుల క్రితం మన జవాన్లను కాల్చిచంపాయి. జమ్మూలోని పూంఛ్‌ సెక్టార్‌లోని భారత భూభాగంలోకి చొరబడిన పాక్‌ సైనికులు ఔట్‌పోస్టుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు భారత సైనికులు మృతి చెందారు. ఈ ఘటనపై రక్షణ మంత్రి ఆంటోనీ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. దాడి వెనుక పాక్‌ హస్తం లేదని, పాక్‌ సైనికుల దుస్తులు ధరించిన 20 మంది ఉగ్రవాదులు కాల్పులు జరిపారని తెలిపారు. అయితే, అప్పటికే సైన్యం మరో ప్రకటన చేసింది. పాక్‌ జవాన్లతో పాటు ఉగ్రవాదులు కలిసి ఈ దాడి చేశారని వెల్లడించింది. పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసిన నేపథ్యంలో ఆంటోనీ క్షమాపణ చెప్పాలని, రాజీనామా చేయాలని విపక్షాలు బుధవారం ఉభయ సభలను అడ్డుకున్నాయి. రక్షణ మంత్రి పాక్‌కు పరోక్షంగా మద్దతిస్తున్నారని నిప్పులు చెరిగారు. దీంతో ఆంటోనీ గురువారం సభలో మరో ప్రకటన చేశారు. సైన్యం, రక్షణ శాఖ చేసిన పరస్పర విరుద్ధ ప్రకటనలపై విపక్షాల ఆందోళనకు దిగిన నేపథ్యంలో, ఈ వ్యవహారంపై ఆంటోనీ స్పందించారు. తనకు అందిన సమాచారం మేరకే మొదటి ప్రకటన చేశానని ఆయన వివరించారు. పూంచ్‌ సెక్టార్‌లో జరిగిన ప్రాంతాన్ని ఆర్మీ చీఫ్‌ పరిశీలించారని చెప్పారు. ఆయన ప్రకటన చేసిన వెంటనే సభ రెండు గంటలకు వాయిదా పడింది.