పది జిల్లాల తెలంగాణే.. హైదరాబాదే రాజధాని


బిల్లు పెట్టే వరకూ పోరాడుతాం : కోదండరామ్‌
హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) :
ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటే లక్ష్యమని టీ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన జేఏసీ విస్తృత స్థాయి సమావేశానికి కోదండరాం అధ్యక్షత వహించారు. అనంతరం జేఏసీ నేతలతో కలిసి మీడియాకు సమావేశ విశేషాలను వివరించారు. తెలంగాణలో అంతర్భాగమైన హైదరాబాద్‌పై కొందరు కావాలనే వివాదం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ కీలక సమయంలో కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు మౌనంగా వుండదని సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఇంకా కుట్రలు, కుతుంత్రాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు కావాలని రెండు ప్రాంతాల ప్రజలను రెచ్చగొడుతున్నారని కోదండరాం తీవ్రంగా విమర్శించారు. ఈ కుట్రలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కూడా వెనుక వుండి సమైక్యాంధ్ర ఉద్యమానికి ఊతమిస్తున్నాడని ధ్వజమెత్తారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన డీజేపీ హోదాలో దినేశ్‌ రెడ్డి ఒక ప్రాంతానికి అనుకూలంగా పనిచేస్తున్నాడని ఆరోపించారు. డీజీపీని మార్చాలని, ఇతర రాష్ట్రాల కేడర్‌కు చెందిన వారిని డీజీపీగా నియమించాలని ఈ సందర్భంగా కోదండరాం డిమాండ్‌ చేశారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ఆమోదించాలని కోరారు. సీమాంధ్ర నాయకుల కుట్రలను తిప్పి కొట్టడానికి మరోసారి ఏకం కావాలని కోరారు. సీమాంధ్ర కుట్రలను ఎదుర్కోవటానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు ఉద్యమం కొనసాగించే దిశగా కార్యాచరణకు దిగుతామని వివరించారు. ఈనెల 10 నుంచి శాంతి, సద్భావన ర్యాలీలను నిర్వహించాలని, 12న ఉద్యోగ జేఏసీ నిర్ణయించిన కార్యక్రమాలలో తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయాలను కరపత్రాల రూపంలో పంపిణీ చేయాలని సూచించారు. వీటికి సమాంతరంగా హైదరాబాద్‌లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. మీడియా నిస్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న ఎన్‌టీవిని తెలంగాణ ప్రజలు చూడొద్దని, ఆ టీవి కార్యక్రమాల చర్చల్లో తెలంగాణ నాయకులు పాల్గొనవద్దని పిలువునిచ్చారు. ఈ సమావేశంలో బి. వినోద్‌కుమార్‌, డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌, బి. అశోక్‌ కుమార్‌ యాదవ్‌, వేణుగోపాల్‌, సూర్యం, గోవర్ధన్‌, సంధ్య, జేఏసీ అగ్రనేతలు మల్లేపల్లి లక్ష్మయ్య, అద్దంకి దయాకర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, దేవీ ప్రసాద్‌, విఠల్‌, కారెం రవీందర్‌ రెడ్డి, రాజేందర్‌ రెడ్డి, ప్రహాద్‌, మణిపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.