షిండే డిశ్చార్జి నేడు రాజ్యసభలో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన?


ముంబయి, ఆగస్టు 11 (జనంసాక్షి) :
కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ఆదివారం ముంబయిలోని బ్రీచ్‌ కాండీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఇటీవల శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆయన పూర్తిగా కోలుకోవడంతో ఉదయం వైద్యులు డిశ్చార్జి చేశారని షిండే కుమార్తె షోలాపూర్‌ ఎమ్మెల్యే ప్రీతి తెలిపారు. ఆయన ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ఆమె వెల్లడించారు. మరో ఐదారు రోజుల్లో ఆయన పూర్తిస్థాయిలో అధికారిక విధులకు హాజరవుతారని చెప్పారు. అప్పటి వరకు ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారన్నారు. ఊపిరితిత్తులు కొద్దిగా పెరగడంతో ఈనెల 4న వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. అయితే సోమవారం రాజ్యసభలో తెలంగాణకు అనుకూలంగా షిండే ప్రకటన చేసే అవకాశమున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ తెలంగాణపై కేంద్రం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షిండే డిశ్చార్జి తర్వాత తెలంగాణపై ప్రభుత్వం ప్రక్రియ ఊపందుకుంటుందనే చెప్తున్నారు. 1999లో 41 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇప్పించిన అప్పటి సీఎల్పీ నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, 2008లో తెలంగాణపై అసెంబ్లీలో రోశయ్య నేతృత్వంలో కమిటీని ప్రకటించిన సందర్భంగా అసెంబ్లీలో జరిగిన చర్చల వివరాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిగణలోకి తీసుకుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలపై వైఎస్‌ రోశయ్య నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసినప్పుడు సభలో వివిధ పార్టీలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, 2009లో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీలో తెలంగాణపై జరిగిన చర్చను పరిగణలోకి తీసుకుంటామని ఇది వరకే షిండే ప్రకటించారు. ఈనేపథ్యంలో షిండే ఒకటి, రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో జరిగిన చర్చ, అభిప్రాయాల ఆధారంగా ఒక నోట్‌ విడుదల చేసి మాట్లాడుతారని తెలిసింది.